- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PAN: పాన్ కార్డు రూల్స్‌లో కొత్త మార్పులు
సామాన్యులు, చిరు వ్యాపారుల ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తూ పాన్ లావాదేవీల పరిమితిని ఆదాయ పన్ను శాఖ పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మీరు తరచుగా నగదు లావాదేవీలు చేస్తున్నారా, ఆస్తి లేదా వాహనాలను కొనుగోలు చేస్తున్నారా అయితే మీకో గుడ్‌న్యూస్. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు మీక్కాస్త ఊరటనివ్వనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025లో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పాన్ సంబంధిత నిబంధనల్లో మార్పులు చేసింది. సామాన్యులు, చిరు వ్యాపారుల ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తూ పాన్ లావాదేవీల పరిమితిని ఆదాయ పన్ను శాఖ పెంచింది. అంతేకాకుండా బ్యాంకింగ్, వ్యాపార లావాదేవీలను సరళతరం చేస్తూ కొత్త ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఆ వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
బ్యాంకింగ్ లావాదేవీల్లో నిబంధనల మార్పు
ప్రస్తుత నిబంధనల ప్రకారం, బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో రోజుకు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి. అయితే, కొత్త నిబంధనల్లో ఈ పరిమితిని పూర్తిగా తొలగించారు. బదులుగా, వార్షిక పరిమితిని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 10 లక్షలు దాటిన డిపాజిట్లు లేదా విత్‌డ్రాలకు మాత్రమే తప్పనిసరి పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో తరచుగా చిన్న చిన్న నగదు లావాదేవీలు చేసే వారికి భారీ ఉపశమనం లభించనుంది.
వాహనాలు కొనాలన్నా పాన్ ఉండాల్సిందే
వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఫోర్ వీలర్ కొన్నప్పుడు పాన్ ఇవ్వాల్సి ఉండేది. అయితే, కొత్త నిబంధనల్లో కొంత మార్పు చేశారు. రూ. 5 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాలు కొన్నప్పుడు పాన్ సమర్పించాల్సిన అవసరంలేదు. అయితే, మొదటిసారి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఏ వాహనం కొన్నా పాన్ ఇవ్వాలని నిబంధనలు పేర్కొన్నాయి.
హోటల్ బిల్లులకూ ఇవ్వాల్సిందే
దేశంలోని పర్యాటక, ఆతిథ్య రంగాలను ప్రోత్సహించడానికి హోటల్, రెస్టారెంట్ బిల్లు చెల్లింపుల పరిమితిని రెట్టింపు చేశారు. ఇదివరకు రూ.50,000 దాటిన బిల్లులకు పాన్ సమర్పించాల్సి వచ్చేది. అయితే, ఈ పరిమితిని రూ. లక్షకు పెంచారు. ఈ నిబంధన బంకెట్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలకు కూడా వర్తించనుంది.
ఆస్తి కొనుగోలు
రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఆస్తి కొనుగోలు, అమ్మకం, బహుమతి (గిఫ్ట్) కింద జరిగే లావాదేవీలకు ఉన్న పాన్ కార్డు పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. దీనర్థం ఇకనుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేవీలకు మాత్రమే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్ పాలసీలు
ఇప్పటివరకు రూ.50,000 పైన ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ సమర్పించాల్సి ఉండేది. దీన్ని మారుస్తూ, బీమా కంపెనీల నుంచి ఏదైనా పాలసీ కొనుగోలు చేసే సమయంలో పాన్ కార్డు తప్పనిసరి అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం
ఇక, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రానుంది. 60 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇటీవల యూనియన్ బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా నియమ నిబంధనలను సరళతరం చేశారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. పాత చట్టంలో సంక్లిష్టంగా ఉన్న సెక్షన్లను 819 నుంచి 536కి తగ్గించడమే కాకుండా, సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునే కొత్త చట్టాన్ని రూపొందించారు.






