- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Basmati Rice: రవాణాలో చిక్కుకున్న 4,00,000 టన్నుల బాస్మతి బియ్యం
మధ్యప్రాచ్యంలో షిప్పింగ్ మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం నిలిచిపోయింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ప్రతికారంతో ఇరాన్ తిరిగి అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు అంతకంతకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరుకు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతతో మనదేశంలో ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో షిప్పింగ్ మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం నిలిచిపోయింది. రాయిటర్స్ ప్రకారం, ఇటీవలి దాడుల తర్వాత అనేక ఎగుమతి ఒప్పందాలు ఆగిపోయాయి. నౌకల ద్వారా సరుకులను పంపే ఖర్చు రెట్టింపు అయింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వంటి మధ్యప్రాచ్య దేశాలు మనదేశ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో సగానికి పైగా కొనుగోలు చేస్తాయి. తాజా సంఘర్షణ కారణంగా, దాదాపు 2,00,000 టన్నుల బియ్యం ఓడల్లో చిక్కుకున్నాయి. మరో 2,00,000 టన్నులు ఎక్కడికీ వెళ్ళకుండా భారత ఓడరేవుల వద్ద ఉండిపోయాయి.
హార్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి ప్రయత్నించే నౌకలపై తాము దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరంచె కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో అనేక నౌకలు ఈ ప్రాంతాన్ని తప్పించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. బీమా కంపెనీలు సైతం హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలను కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల షిప్పింగ్ ధరలు భారీగా పెరిగాయి. రవాణాలో ఆగిపోయిన ఇంత పెద్ద మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేసే ఇతర మార్కెట్లు లేకపోవడంతో భారతీయ ఎగుమతిదారులు మధ్యప్రాచ్యంలోని కొనుగోలుదారుల నుంచి కొత్త ఆర్డర్‌లను తీసుకోవడం నిలిపేశాయి. పాత అగ్రీమెంట్లను పూర్తి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు.






