Medicines: 16 రకాల ఔషధాలపై కేంద్రం నిషేధం

by S Gopi |

16 రకాల ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ ఔషధాల (ఎఫ్‌డీసీ-రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల మిశ్రమం) తయారీ, అమ్మకం, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.

Medicines: 16 రకాల ఔషధాలపై కేంద్రం నిషేధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మెడికల్ రెగ్యులేటరీ రివ్యూ తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన చికిత్సాపరమైన సమర్థన, తగినన్ని శాస్త్రీయ ఆధారాలు లేవని తేలడంతో దేశంలో 16 రకాల ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ ఔషధాల (ఎఫ్‌డీసీ-రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల మిశ్రమం) తయారీ, అమ్మకం, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940’ లోని సెక్షన్ 26ఏ కింద ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. మార్కెట్లో లభిస్తున్న కొన్ని రకాల ఔషధాలకు సంబంధించి రోగుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో 2021లోనే ఈ సమీక్ష ప్రక్రియ మొదలైంది. సుదీర్ఘ పరిశోధనలు, క్లినికల్ ఆధారాలు, ఫార్మా కంపెనీల వాదనలను పరిశీలించిన తర్వాత, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) సబ్-కమిటీ సిఫార్సుల మేరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బ్యాన్ విధించారు. నిషేధిత జాబితాలో అమోక్సిసిలిన్, సెఫ్యూరాక్సిమ్ వంటి ప్రముఖ యాంటీబయాటిక్స్ కాంబినేషన్లతో పాటు, కడుపునొప్పికి వాడే డైసైక్లోమైన్ మిశ్రమాలు కూడా ఉన్నాయి.

నిపుణుల కమిటీ పరిశీలనలో ఈ కాంబినేషన్ ఔషధాల వల్ల రోగులకు అదనపు చికిత్సా ప్రయోజనం ఏమీ లేదని, పైగా కొన్ని ఫార్ములేషన్లు సరిగ్గా వర్గీకరించలేదని తేలింది. ఉదాహరణకు, ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే అమోక్సిసిలిన్, సెరాటియోపెప్టిడేస్ మిశ్రమానికి ఎటువంటి బలమైన వైద్య ఆధారాలు లభించలేదు. అలాగే కడుపునొప్పి నివారణకు వాడే డైసైక్లోమైన్‌తో పాటు మరో యాంటీకోలినెర్జిక్ పదార్థాన్ని కలపడం పూర్తిగా అనవసరమని నిపుణులు తేల్చారు. కేవలం అల్లోపతి మందులే కాకుండా, చర్మ సంరక్షణ కోసం వాడే అలోవెరా, విటమిన్ ఇ, జోజోబా ఆయిల్స్ కలిగిన కొన్ని క్రీములు, కాస్మెటిక్ కాంబినేషన్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీటితో పాటు షుగర్ వ్యాధికి అంతర్జాతీయ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న గ్లిక్లాజైడ్, క్రోమియం పికోలినేట్ మిశ్రమాన్ని, సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా పారాసెటమాల్, లిగ్నోకైన్ కాంబినేషన్‌ను కూడా తొలగించారు. రోగులకు మార్కెట్లో లభించే ప్రతి ఔషధం ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలతో ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Next Story