నిరుపయోగంగా 13 కోట్ల జన్ ధన్ ఖాతాలు

by Muthe.Rajitha |

దేశంలో కోట్ల సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.

నిరుపయోగంగా 13 కోట్ల జన్ ధన్ ఖాతాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కోట్ల సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో 13 కోట్ల జన్ ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి నేడు లోక్‌సభలో వెల్లడించారు. పంకజ్ చౌదరి లోక్‌సభలో జన్ ధన్ ఖాతాలపై ఇచ్చిన సమాచారం ప్రకారం... ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద తెరిచిన ఖాతాల్లో సుమారు 13 కోట్ల ఖాతాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు.

ఈ ఖాతాలు రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉన్నాయని, వీటిలో రూ.14,750 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు. 2014లో ప్రారంభమైన ఈ పథకం బ్యాంకు ఖాతాలు లేని వారికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు, రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, రూ.2 లక్షల ప్రమాద బీమాతో పలు సహా ఆర్థిక సేవలను అందించడమే PMJDY లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 55.9 కోట్ల జన్ ధన్ ఖాతాలలో దాదాపు 23% (సుమారు 13 కోట్లు) నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఇవి ఆధార్ లింకింగ్ లేకపోవడం, డూప్లికేట్ ఖాతాలు, బ్యాంకు ఖాతాలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఇలా జరిగి ఉండవచ్చన్నారు. అయితే 2017లో ఇన్‌యాక్టివ్ ఖాతాలు 39.62% ఉండగా, 2024 నవంబర్ నాటికి ఇది 20.91%కి తగ్గినట్లు పేర్కొన్నారు.

ఈ ఖాతాలను ఆక్టివేట్ చేయడానికి బ్యాంకులు రీ-కేవైసీ, బ్యాంక్ మిత్ర సేవల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం బ్యాంకులను ఆదేశించినప్పటికీ.. 2018 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదని చెప్పడంతో.. ఈ ఇన్‌యాక్టివ్‌ ఖాతాలను మూసివేయడం కష్టమవుతోందని వివరించారు. కాగా ఇలాంటి ఇన్‌యాక్టివ్‌ ఖాతాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 2.34 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 78.5 లక్షలు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Next Story