SBI Research: ప్రతి నలుగురిలో ఒకరికి కనీస వేతనం అందడంలేదు

by S Gopi |

ఇది కేవలం తక్కువ జీతాల సమస్య మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల అమలులో ఉన్న బలహీనతను కూడా బయటపెడుతోంది.

SBI Research: ప్రతి నలుగురిలో ఒకరికి కనీస వేతనం అందడంలేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రతి నలుగురు అసంఘటిత కార్మికుల్లో ఒకరికి చట్టబద్ధమైన కనీస వేతనం కూడా అందడం లేదని నివేదిక పేర్కొంది. ఇది కేవలం తక్కువ జీతాల సమస్య మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల అమలులో ఉన్న బలహీనతను కూడా బయటపెడుతోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 65-70 శాతం వరకు కార్మికులు కనీస వేతనాల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి పారిశ్రామిక రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదని నివేదిక తెలిపింది. ఈ పరిస్థితులే దేశవ్యాప్తంగా కార్మికుల అసంతృప్తికి దారితీస్తున్నాయి. పలు పారిశ్రామిక కేంద్రాల్లో కార్మికుల నిరసనలు పెరగడానికి తక్కువ వేతనాలు, అమలు కాని నిబంధనలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా కార్మికుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణ కార్మికుల్లో మహిళల వాటా 25 శాతం మాత్రమే అయినప్పటికీ, కనీస వేతనం కంటే తక్కువ వేతనం పొందుతున్న వారిలో 45 శాతం మహిళలే ఉన్నారు. ఇది కార్మిక వ్యవస్థలో లింగ అసమానత కొనసాగడాన్ని సూచిస్తోంది. ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రకారం, దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో 80-90 శాతం వరకు ఇప్పటికీ అసంఘటిత రంగంపైనే ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగంపై ఆధారపడటం తగ్గుతున్నప్పటికీ, ఉద్యోగాల ‘ఫార్మలైజేషన్’ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని నివేదిక స్పష్టం చేసింది.

Next Story