మెక్‌డొనాల్డ్స్ బర్గర్ తినమంటున్న ‘బర్గర్ కింగ్’

by  |
మెక్‌డొనాల్డ్స్ బర్గర్ తినమంటున్న ‘బర్గర్ కింగ్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ సందులో ఏదైనా కొత్త దుకాణం ఏర్పాటు చేస్తే.. కొద్దిరోజుల్లోనే దానికి పోటీగా మరో దుకాణం ఓపెన్ అవుతుంది. మార్కెట్లో ఏదైనా బ్రాండ్ నుంచి కొత్త ఉత్పత్తి వస్తే.. వెంటనే కాంపిటీషన్‌గా మరో బ్రాండ్ ఉత్పత్తి వచ్చేస్తుంది. ఏదైనా మొబైల్ కంపెనీ లేదా షాపింగ్ మాల్.. ఆఫర్స్ ప్రకటించగానే, మిగతా కంపెనీలు కూడా అదే బాట పడతాయి. ఇలా మార్కెట్‌లో ప్రతి వస్తువు, ప్రొడక్ట్‌పై తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే, తమకు పోటీదారుగా ఉన్న బ్రాండ్ ఉత్పత్తులు కొనమని.. ఇప్పటివరకు ఏ సంస్థ కూడా చెప్పి ఉండదు. కానీ ‘బర్గర్ కింగ్’ ఆ పని చేసి చూపించింది. మెక్‌డొనాల్డ్స్ బర్గర్ ఆర్డర్ చేయమని ‘బర్గర్ కింగ్’ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ బర్గర్ కింగ్ ఎందుకిలా చెప్పింది?

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్ సడలింపులు వచ్చినా సరే.. తిరిగి పుంజుకునేందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశముంది. అయితే, కొన్ని దేశాల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సంస్థ ‘బర్గర్ కింగ్’ కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టాలను అధిగమించడానికి ‘మెక్ డొనాల్డ్స్’ వంటి ఇతర సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక మార్కెట్ పరంగా చూసుకుంటే.. బర్గర్ కింగ్‌కు మెక్‌డొనాల్డ్స్ గట్టి పోటీదారే కావడం గమనార్హం.

‘మా పోటీ సంస్థలైన KFC, డొమినోస్ పిజ్జా, సబ్ వే, ఫైవ్ గాయ్స్, గ్రెగ్స్, పాపా జాన్స్, టాకో బెల్, ఇతర ఫుడ్ అవుట్‌లెట్ల నుంచి ఆహారం ఆర్డర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. మిమ్మల్ని ఇలా చేయమని అడగాల్సి వస్తుందని మేమస్సలు ఊహించలేదు. రెస్టారెంట్లలో వేలాది మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ సంక్షోభ సమయంలో ఇలాంటి సంస్థలకు మీ మద్దతు అవసరం. కాబట్టి.. మీరు సహాయం చేయాలనుకుంటే, హోమ్ డెలివరీ, టేక్ ఎవే, డ్రైవ్ త్రూ ద్వారా రుచికరమైన ఆహారాన్ని పొందండి’ అని బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారడంతో బర్గర్ కింగ్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Next Story

Most Viewed