కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఇంటి ముందు పెళ్లి కూతురు ధర్నా.. ఏం జరిగిందంటే..?

by  |
Bride
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి రోజూ అనేకమంది తమకు న్యాయం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాలు చేస్తుంటారు. అందులో కొందరికి అనుకున్నది లభించినా కొందరికి మొండి చెయ్యి గతి అవుతుంది. అయితే తాజాగా ఓ పెళ్లి కూతురు ధర్నాను చేపట్టింది. అందులోనూ పెళ్లి బట్టల్లో ధర్నా చేసింది. ఈ ఘటన ఒడిశా బెర్హంపుర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి కూతురు డింపుల్ దష్, పెళ్లి కొడుకు సుమీత్ సాహు కొంత కాలం క్రితం రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఆ తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకొని ఇద్దరికీ సాంప్రదాయ బద్దంగా వివాహం జరపాలని నిర్ణయించుకున్నాయి. అయితే అనుకున్నట్లే పెళ్లి కూతురు పెళ్లి మండపం చేరుకుంది. కానీ అక్కడికి పెళ్లి కొడుకు కానీ, వాళ్ల కుటుంబం వారు కానీ వచ్చిన జాడ కనిపించలేదు. దానికి తోడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టి సమాధానం రాలేదు. దీంతో పెళ్లి కూతురు, ఆమె తల్లి ఇద్దరూ పెళ్లి కొడుకు సాహు ఇంటికి చేరుకొని ధర్నా చేపట్టారు.

పెళ్లి కూతురు మాట్లాడుతూ.. మేమిద్దరం 2020 సెప్టెంబర్ 7న రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకన్నాం. అప్పట్లో సాహు కుటుంబీకులు తనను ఎంతో హింసించారు. గదిలో పెట్టి బందించారు కూడా. కానీ అప్పట్లో సాహు నా తరఫున మాట్లాడే వాడు. కానీ కొంతకాలానికి సాహు కూడా తన కుటుంబీకులతో నన్ను బాధ పెట్టడం ప్రారంభించాడు. దాంతో నేను మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత సోహు తండ్రి మా ఇంటికి వచ్చి ఇద్దరికీ సాంప్రదాయ బద్దంగా వివాహం చేస్తామని అన్నారు. దీంతో నవంబర్ 22న పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు పెళ్లి మండపంలో ఎవ్వరూ కనిపించలేదని తెలిపింది.

విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెళ్లి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పెళ్లి కొడుకు కుటుంబం కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌పీ పినక్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టుకు వెళ్లిందని, కోర్టులో ఉన్న కేసు విషయంలో పోలీసులకు పరిమితులు ఉంటాయని, కోర్టు చెప్పిన విధంగానే నడుచుకుంటామని ఆయన తెలిపారు.



Next Story