బజార్ల పడ్డ పూజార్లు!

by Chintha Aamani |

<p>దిశ, హైదరాబాద్: ఇది కరోనా కాలం.. ఈ వైరస్ సమాజంలోని అన్ని వర్గాలకు ఎన్నడూ లేని కష్టాలను తెచ్చిపెడుతోంది. వేతనజీవులే పెద్ద విపత్తుగా భావిస్తున్నారు. అలాంటిది మరి, రోజువారీగా ఆయా పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో కూలీ కోసం అడ్డాలలో పనులు వెతుక్కున్నట్టుగా .. పూజలు, వ్రతాలు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి పూజారుల అవసరముంటే నగరంలోని చిక్కడపల్లి అడ్డాకు వెళ్ళాల్సిందే. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తున్న ఈ [&hellip;]</p>

బజార్ల పడ్డ పూజార్లు!
X

దిశ, హైదరాబాద్: ఇది కరోనా కాలం.. ఈ వైరస్ సమాజంలోని అన్ని వర్గాలకు ఎన్నడూ లేని కష్టాలను తెచ్చిపెడుతోంది. వేతనజీవులే పెద్ద విపత్తుగా భావిస్తున్నారు. అలాంటిది మరి, రోజువారీగా ఆయా పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో కూలీ కోసం అడ్డాలలో పనులు వెతుక్కున్నట్టుగా .. పూజలు, వ్రతాలు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి పూజారుల అవసరముంటే నగరంలోని చిక్కడపల్లి అడ్డాకు వెళ్ళాల్సిందే. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తున్న ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్నందున దేవాలయాలు మూతపడ్డాయి. ప్రజల విశ్వాసాల మేరకు నిర్వహించే పూజలు, వ్రతాలు, శుభకార్యాలు అర్ధాంతరంగా నిలిచాయి. దీంతో చిక్కడపల్లి అడ్డాలో దయగల వారేదైనా ఇస్తే పుచ్చుకుందామనే దయనీయంగా పురోహితులు ఎదురుచూస్తున్నారు.

బోసిపోతున్న పురోహితుల అడ్డా…

కరోనా కారణంగా ప్రపంచమే లాక్‌డౌన్ కావాల్సి వచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కార్యాకలాపాలు ఎక్కడికక్కడే నిలిచాయి. దేవాలయాలు సైతం బంద్ అయ్యాయి. ఈ దేవాలయాల్లో పూజలు చేసే పూజారుల్లో కొద్దిమందే ప్రభుత్వ ఉద్యోగులు. అత్యధికంగా పలు దేవాలయాలలో పూజారులుగా పనిచేస్తారు. దేవునికి కైంకర్యాలు నిర్వహించే సమయంలో దేవుని వుండీతోపాటు పూజారులకు కొంత సొమ్మును దక్షిణ వేస్తారు. సాయంత్రానికల్లా జమ అయిన మొత్తంతో ఆ పూజారులు వారి కుటుంబాల అవసరాలను తీర్చుకుంటారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో దేవాలయాలు తెరుచుకోవడం లేదు. ప్రజలు ఒకే చోట గుమిగూడేందుకు నిషేధ ఆంక్షలు ఉన్నందున ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. విశ్వాసాల మేరకు జరుపుకునే పూజలు, వ్రతాలు, శుభకార్యాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫలితంగా ప్రజలు వారి ఇళ్లల్లో నిర్వహించుకునే శుభకార్యాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో నగరంలోని చిక్కడపల్లి అడ్డాలో పూజారులు లేకబోసిపోతోంది.

పూట గడవక దినదిన గండంగా..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం మార్చి 22న నిర్వహించిన జనతా కర్ఫ్యూ మరుసటి రోజుకే లాక్‌డౌన్‌గా మారింది. నిత్యావసరాలు మినహా 22 రోజులుగా ఇతర కార్యకలాపాలన్నీ బంద్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆచార, సంప్రదాయాల ప్రకారం ఎవరి ఇళ్లల్లోనైనా పూజలు, వ్రతాలు, పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల నిర్వాహణకు పూజారులు అవసరం పడతారోనని హైదరాబాద్ చిక్కడపల్లి ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న దుకాణాల మెట్లపై తెల్లవారింది మొదలుకొని పూజారులు వేచి ఉంటారు. కానీ, లాక్‌డౌన్ ఉన్నందున 20 రోజులుగా ఆ అడ్డా చిన్నబోతోంది. ప్రభుత్వమే శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని చెప్పడంతో ఖరారైన ముహుర్తాలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులుగా కావడంతో ప్రజలు పొదుపు చర్యలకు అలవాటు పడుతున్నారు. దీంతో కరోనా కంటే ముందు చేద్దామనుకున్న కార్యాలను ప్రజలు చాలా వరకూ రద్దు చేసుకుంటున్నారు. రోజువారీ పూజా కార్యక్రమాలు లేకపోవడంతో పూజారులకు పూట గడవడం దినదిన గండంగా మారింది.

దయనీయంగా ఎదురుచూపులు..

చిక్కడపల్లి ఆంధ్రా బ్యాంకు ఎదురుగా ఉన్న దుకాణాల మెట్లపై రోజూ సుమారు 40 మంది పూజారులు.. పూజ కార్యక్రమాలు చేయించుకునే వారికోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున ప్రజలెవరూ రోడ్లపైకి రావడం లేదు. దీంతో రోజువారీగా అడ్డా కూలీ లాగా బతుకులీడ్చే ఆ పూజారులు పూజలు లేక ఉపాధి కరువై పస్తులుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది అడ్డా వద్దకు రావడం మానేశారు. కుటుంబం గడిచేందుకు బతుకు బండి ఎలాగైనా లాగేందుకు కొందరు మాత్రం వారికున్న బాధలను కడుపులోనే అణుచుకుంటూ అడ్డా వద్దకు వస్తున్నారు. ఈ సందర్భంగా అడ్డాలో కన్పించిన ఆనంద్ కుమార్ శర్మ మాట్లాడుతూ 20 రోజులుగా అడ్డాకు వస్తున్నా.. ఒక్క రోజు కూడా పని దొరకలేదంటూ దీనంగా చెప్పాడు. ప్రజలెవరూ రోడ్లపైకి రానందున పని దొరకదని తెలుసని, కానీ, దయార్థ హృదయంతో ఎవరేదైనా ఇస్తే పుచ్చుకుని వారి కుటుంబానికి దీవెనలు అందించే ఉద్దేశంతో రోజూ అడ్డాకు వస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబానికి ఏమైనా ఆసరా దొరుకుతుదేమోనని ప్రతిరోజూ నాలుగైదు గంటలు ఎదురు చేస్తున్నామని మరో పూజారి అశోక్ కుమార్ శాస్త్రి చెప్పారు.

Tags: Corona Effect, Lockdown, Brahmans Adda in Chikkadpally, Hyderabad

Next Story