ఇండియా vs ఇంగ్లాండ్.. మూడో టెస్టు మ్యాచ్ అప్‌డేట్స్

92

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలో అత్యంత పెద్దదైన క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్యూరేటర్ ముందుగానే చెప్పినట్లు పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరించింది. నెమ్మదైన పిచ్‌ను ఉపయోగించుకొని భారత స్పిన్ ద్వయం చెలరేగిపోయారు. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ 6 వికెట్లు.. అశ్విన్ 3 వికెట్లతో చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఏ దశలోనూ కోలుకోనీయకుండా వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఓపెనర్ జాక్ క్రాలీ తప్ప ఎవరూ పరుగులు చేయలేకపోయారు. దీంతో 112 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఆచితూచి ఆడుతున్నది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా తరఫున క్రీజులో రోహిత్ శర్మ, అజింక్య రహానే ఉన్నారు.

పేటీఎం టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమైంది. పింక్ బంతితో నిర్వహిస్తున్న ఈ డే/నైట్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. అయితే తన నిర్ణయం ఎంత తప్పో కొద్దిసేపట్లోనే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కు అర్ధం అయ్యింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, డామ్ సిబ్లే శుభారంభాన్ని అందించలేదు. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ తాను వేసిన రెండో ఓవర్లోనే టీమ్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు.

ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో డామ్ సిబ్లే (0) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. పిచ్‌ను గమనించి విరాట్ కోహ్లీ 7వ ఓవర్‌లోనే స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు బంతిని అందించాడు. అక్షర్ వేసిన తొలి బంతికే జానీ బెయిర్‌స్టో (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. జాక్ క్రాలీ (53), జో రూట్ (17) కలసి కాసేపు టీమ్ ఇండియా బౌలర్లను ఎదుర్కున్నారు. ముఖ్యంగా క్రాలీ దూకుడుగా ఆడుతూ బౌండరీలు రాబట్టాడు. ఈ క్రమంలో జాక్ క్రాలీ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రాలీ, రూట్ కలసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకొని పోయి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 21.5 బంతికి జో రూట్ (17) ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. మరి కొద్ది సేపటికే జాక్ క్రాలీ (53) అక్షర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

రెండో సెషన్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్లు మరింత ప్రమాదకరంగా మారారు. బంతిని తిప్పుతూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టారు. సెషన్ ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే ఓల్లీ పోప్ (1)ను రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో అక్షర్ పటేల్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (6)ను ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అప్పటికే టాప్, మిడిల్ ఆర్డర్ మొత్తం పెవీలియన్‌కు చేరుకోవడంతో భారమంతా టెయిలెండర్లపై పడింది. సొంత గ్రౌండ్‌లో ఆడుతున్న అక్షర్ పటేల్ ఈ సెషన్‌లో ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చేశాడు. కాస్త బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న జోఫ్రా ఆర్చర్ (11), స్టువర్డ్ బ్రాడ్ (3) లను అక్షర్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో జాక్ లీచ్ (3) పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివరి వరకు కాస్త పోరాడిన బెన్ ఫోక్స్(12) అక్షర్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జాక్ క్రాలీ తప్ప ఎవరూ పరుగులు చేయలేకపోయారు. అక్షర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా చాలా నెమ్మదిగా పరుగులు రాబట్టింది. రెండో సెషన్‌లో 5 ఓవర్లు ఆడిన ఇండియా.. అది ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది.

ఇక మూడో సెషన్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సహజ శైలిలో స్వేచ్చగా ఆడినా.. శుభమన్‌గిల్ మాత్రం పరుగులు రాబట్టడానికి కష్టపడ్డాడు. 26 బంతుల వరకు గిల్ ఒక్క పరుగు కూడా చేయలేదు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బౌండరీతో టచ్‌లోకి వచ్చాడనుకున్న గిల్(11) ఆర్చర్ వేసిన బౌన్సర్‌ను పుల్ చేయబోయి క్రాలీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజార (0) అభిమానులను నిరాశ పరుస్తూ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ కలసి నిలకడగా ఆడారు. ఒకసారి వీరిద్దరీ బ్యాటింగ్ నత్తనడకలా సాగింది. అయితే కాస్త కుదురుకున్నాక.. రోహిత్ నెమ్మదిగా బ్యాట్ ఝులిపించాడు.

 బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మటెస్టుల్లో 12వ అర్దసెంచరీ నమోదు చేశాడు. 63 బంతుల్లోనే రోహిత్ 50 పరుగులు చేయడం విశేషం. రోహిత్ , కోహ్లీ కలసి పరుగుల వేగం పెంచారు. వీరిద్దరూ క్రీజులో పాతుకొని పోయి ఇంగ్లాంగ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నారు. రోహిత్, కోహ్లీ (27) కలసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. జాక్ లీచ్ వేసిన తొలి రోజు చివరి ఓవర్‌లో విరాట్ కోహ్లీ (27) స్వేర్ కట్ షాట్ ఆడబోయి బంతిని వికెట్ల మీదకు తెచ్చుకొని బౌల్డ్ అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమ్ ఇండియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 13 పరుగుల వెనుకబడి ఉన్నది. జాక్ లీచ్ 2 వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ తీశాడు. తొలి రోజు ఆటమొత్తం బౌలర్ల వైపుకే మొగ్గుచూపింది. రెండో రోజు మొత్తం టీమ్ ఇండియా నిలబడగలిగితే.. ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం సాధించే అవకాశం ఉంటుంది.

స్కోర్ బోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్

జాక్ క్రాలీ (ఎల్బీడబ్ల్యూ)(బి) అక్షర్ పటేల్ 53, డామ్ సిబ్లే (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0, జానీ బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ)(బి) అక్షర్ పటేల్ 0, జో రూట్ (ఎల్బీడబ్ల్యూ)(బి) రవిచంద్రన్ అశ్విన్ 17, బెన్ స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అక్షర్ పటేల్ 6, ఓల్లీ పోప్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 1, బెన్ ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12, జోఫ్రా ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11, జాక్ లీచ్ (సి) పుజార (బి) రవిచంద్రన్ అశ్విన్ 3, స్టువర్ట్ బ్రాడ్ (సి) జస్ప్రిత్ బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3, జేమ్స్ అండర్సన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లు) 112 ఆలౌట్

వికెట్ల పతనం : 1-2, 2-27, 3-74, 4-80, 5-81, 6-81, 7-93, 8-98, 9-105, 10-112

బౌలింగ్ : ఇషాంత్ శర్మ (5-1-26-1), జస్ప్రిత్ బుమ్రా (6-3-19-0), అక్షర్ పటేల్ (21.4-6-38-6), రవిచంద్రన్ అశ్విన్ (16-6-26-3)

ఇండియా తొలి ఇన్నింగ్స్

రోహిత్ శర్మ 57 బ్యాటింగ్, శుభమన్ గిల్ (సి) జాక్ క్రాలీ (బి) జోఫ్రా ఆర్చర్ 11, చతేశ్వర్ పుజార (ఎల్బీడబ్ల్యూ)(బి) జాక్ లీచ్ 0, విరాట్ కోహ్లీ (బి) జాక్ లీచ్ 27, అజింక్య రహానే 1 బ్యాటింగ్ ; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లు) 99/3

వికెట్ల పతనం : 1-33, 2-34, 3-98

బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ (9-6-11-0), స్టువర్ట్ బ్రాడ్ (6-1-16-0), జోఫ్రా ఆర్చర్ (5-2-24-1), జాక్ లీచ్ (10-1-27-2), బెన్ స్టోక్స్ (3-0-19-0)

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..