ఇంటి వాతావరణాన్ని మార్చేసే ‘ఇండోర్ ప్లాంట్స్’

by  |
ఇంటి వాతావరణాన్ని మార్చేసే ‘ఇండోర్ ప్లాంట్స్’
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటి పరిసరాల్లో మొక్కలు పెట్టుకోవడం సర్వసాధారణమే. ఇంట్లోనే మొక్కలు పెంచడం నేటి ఫ్యాషన్. ఇండోర్ ప్లాంట్స్ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. దాంతో పాటు ఇంట్లోని వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదంగా మారుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తూనే.. సువాసనలు వెదజల్లుతూ మంచి అనుభూతిని అందిస్తాయి. మనసును తేలిక పరుస్తాయి. చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా. మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఉండటం వల్ల.. ఆరోగ్యం కూడా మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బెడ్ రూమ్ లో మొక్కలు పెట్టుకుంటే … అవి అందించే సువాసనల వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. ఇండోర్ ప్లాంట్స్ ని పెంచుకోవడానికి పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదు. వాటికి ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు.

ఇటీవలి కాలంలో చాలామంది ఇళ్లల్లో ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచుకుంటున్నారు. నీరు మాత్రమే అవసరమైన ఇండోర్ ప్లాంట్స్‌ను గాజు కుండీలలో పెంచుకున్నట్లయితే చూడముచ్చటగా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ కోసం .. భిన్న రకాల కుండీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వేసవి కాలం గదులు చల్లగా ఉంచేందుకు కూడా ఈ మొక్కలు దోహదపడతాయి.

యుక పామ్ :

ఈ మొక్కకు మెయింటెనెన్స్ ఎక్కువగా అవసరం ఉండదు. సూర్యరశ్మి తో పాటు కాసిన్ని నీళ్లు అందిస్తే చాలు ఎంచక్కా పెరుగుతాయి. అప్పుడప్పుడు కొన్ని సహజ ఎరువులు ఉపయోగిస్తే… ఇంకా మంచిగా, బలంగా పెరుగుతాయి. గదుల్లో ఫ్రెష్ నెస్ అందించే ఈ మొక్కలు మనసుకు ఉత్సాహానిస్తాయి.

బొన్సాయ్ :

ఈ మొక్కలు ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. బోన్సాయ్ మొక్కలను పెంచుకోవాలంటే మెయింటెనెన్స్ తో పాటు.. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. పండ్ల మొక్కల నుంచి పూల మొక్కల వరకు ఎన్నో రకాల బొన్సాయ్ మొక్కలు అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువ.

వెదురు :

వెదురు మొక్కలను పెంచడం కూడా చాలా సులభం. మట్టి, ఎండ దీనికి అంతగా అవసరం లేదు. కుండీలో నీటిని మాత్రం క్రమం తప్పకుండా మారుస్తున్నట్లయితే, ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. బాంబూ ప్లాంట్స్ ను లక్కీ ప్లాంట్స్ అని కూడా అంటారు. వీటిని ఇంట్లో పెంచుకుంటే… అదృష్టం, ఐశ్వర్యం కలిసివస్తాయని పలువురి విశ్వాసం.

జాస్మిన్ :

బెడ్ రూమ్ లో పెంచుకోవడానికి జాస్మిన్ ను మించిన మొక్క లేదంటే అతిశయోక్తి కాదేమో. గది వాతావరణాన్ని ఎంతో పరిమళభరితంగా మార్చడంతో పాటు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ మొక్కలను పెంచుకోవడానికి కూడా ఎక్కువ శ్రమపడనవసరం లేదు.

పీస్ లిల్లీ :

ఈ మొక్కలను ఏ గదుల్లోనైనా పెంచుకోవచ్చు. వేసవి, వసంత కాలంలో ఈ మొక్కలకు పూసే పువ్వులు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. గది అందాన్ని పెంచుతాయి. అప్పుడప్పుడు వీటికి ఎరువులు అందించాల్సి ఉంటుంది

Tags : indoor plants, home decor, interior


Next Story