పరమ్ వీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం

by  |
పరమ్ వీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం
X

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మినిస్టర్ నేరాల గురించి తెలియగానే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పదేపదే ప్రశ్నించింది.

బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే దత్తా ఈ పిటిషన్ విచారిస్తూ ‘మీరు ఒక పోలీసు కమిషనర్, మీ కోసం చట్టమెందుకు పక్కనబెట్టాలి? పోలీసు అధికారులు, మంత్రులు, రాజకీయ నేతలు చట్టానికి అతీతులా? మీరు చట్టానికి ఆవల ఉన్నట్టు ఊహించుకోవద్దు’ అని కటువుగా స్పందించారు. ‘ఇన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదు? మిమ్మల్ని ఎవరు ఆపారు? దర్యాప్తు చేయాలంటే ఎఫ్ఐఆర్ అత్యవసరం కదా! మీరేమో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సూచించాలని అభ్యర్థిస్తున్నారు. కానీ, ఎఫ్ఐఆర్, దర్యాప్తు పత్రాలేవీ? ఎఫ్ఐఆర్ లేకుండా మేమెలా విచారణ జరపాలి?’ అని ధర్మాసనం పేర్కొంది.

ఒక్క చిన్న లేఖ అయినా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మారవచ్చునని సింగ్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఒక పోలీసు అధికారి. ఒక నేరం జరిగినట్టు తెలిసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీ బాధ్యత. మీరెందుకు ఆ పని చేయలేదు? ఒక నేరం జరిగిందని మీకు తెలిసి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. సింపుల్‌గా సీఎంకు లేఖ రాస్తే సరిపోదు’ అని మండిపడింది.

‘మీ ఫిర్యాదులో హోం మినిస్టర్ ఆ వ్యాఖ్యలను మీ సమక్షంలో అన్నట్టు ఉన్నదా? లేదా ఏ అధికారి అయినా అలాంటి ఆదేశాలు తనకు వచ్చినట్టు తెలిపిన అఫిడవిట్లు ఉన్నాయా?’ అని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై సింగ్ మాట్లాడుతూ, తాను నేరస్తులను ప్రస్తావించారని, కానీ, తన అభ్యర్థనలను ఎవ్వరూ లెక్కచేయలేదని అన్నారు. మరో మార్గం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed