- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ పరిపాలనకు ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : భూ వివాదాలు.. అంతం కావడం లేదు.. అంతు తేలడం లేదు.. దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా వాటి పరిష్కారం ఫలితం తేలని ఫజిల్ గా మారింది.. ఏ కొత్త సొల్యూషన్ తీసుకొచ్చినా, సాంకేతికతకే సవాల్ విసిరే కొత్త సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి.. ఎన్ని సర్వేలు చేసినా, ఎంత పకడ్బందీగా లెక్కలు చేసినా తేలని ఇబ్బందులను ‘బ్లాక్’ చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సర్కార్ శ్రీకారం చుట్టింది.. పైలెట్ ప్రాజెక్ట్‌గా పంజాబ్‌లో విజయవంతమైన […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : భూ వివాదాలు.. అంతం కావడం లేదు.. అంతు తేలడం లేదు.. దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా వాటి పరిష్కారం ఫలితం తేలని ఫజిల్ గా మారింది.. ఏ కొత్త సొల్యూషన్ తీసుకొచ్చినా, సాంకేతికతకే సవాల్ విసిరే కొత్త సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి.. ఎన్ని సర్వేలు చేసినా, ఎంత పకడ్బందీగా లెక్కలు చేసినా తేలని ఇబ్బందులను ‘బ్లాక్’ చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సర్కార్ శ్రీకారం చుట్టింది.. పైలెట్ ప్రాజెక్ట్‌గా పంజాబ్‌లో విజయవంతమైన ‘బ్లాక్‌చైన్ టెక్నాలజీ’ని అమలు చేసే విషయమై విధివిధానాలు రూపొందిస్తోంది. దీంతో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఎవరైనా చూసుకునే వీలు కలుగనుంది. అత్యంత పారదర్శకంగా జరిగే ఈ ప్రక్రియ అమలు చేస్తే సామాన్యుడికి అంతో వెసులుబాటు ఉంటుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో భూ రికార్డుల్లో గందరగోళం నెలకొంది. దశాబ్దాలుగా అనేక సమస్యలు నెలకొంటూనే ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ హక్కులకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు కేసులు, ఫిర్యాదులు లక్షల్లో ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తోనూ పారదర్శకత, సంతృప్తి లభించలేదన్న విమర్శలు ఉన్నాయి. పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానంపైనా ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ పటంలో ఐటీ రంగానికి హైదరాబాద్ ఎంతో ప్రత్యేకత ఉన్నా, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం మాత్రం కావడం లేదు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియలో ఇచ్చిన ఆప్షన్లలోనే సాంకేతికపరమైన అనేక సమస్యలతో తహసీల్దార్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
స్లాట్‌బుక్ చేసుకొని స్టాంపు డ్యూటీ చెల్లించినా ముందుకు సాగని ప్రక్రియలతో ఏర్పాటైన ధరణి పోర్టల్‌ను అత్యంత గొప్పదంటూ సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశంసిస్తున్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించకుండానే ధరణి వంటి పోర్టల్ ప్రపంచంలో మరెక్కడా లేదంటూ మంత్రులు, ప్రజాప్రతినిధులు కీర్తిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని శాసిస్తున్న బ్లాక్చైన్టెక్నాలజీతో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించొచ్చునని గుర్తించడం లేదు.
భూ పరిపాలనలోనూ ఈ టెక్నాలజీతో మెరుగైన, అత్యంత పారదర్శకతను సాధించొచ్చునని అంచనా వేయడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానాలను తెలంగాణలోనూ ఆచరించడం ద్వారా వివాదరహిత భూ పరిపాలనను అందించొచ్చునని రెవెన్యూ చట్టాల నిపుణులు, టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భూ పరిపాలనలోనూ బ్లాక్చైన్టెక్నాలజీని వినియోగించాలని ప్రతిపాదించింది. ఇప్పటికే హర్యానాలో పైలెట్‌ప్రాజెక్టుగా చేపట్టి విజయం సాధించింది. అలాంటి విధానాన్ని ఇక్కడా అనుసరించి మెరుగైన పాలనా వ్యవస్థను రూపొందించాలని ప్రజా సంఘాలు, తెలంగాణ భూ పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
సమస్యలివే..
* తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోనూ భూ రికార్డులను తారుమారు చేసే వ్యవస్థ ఉంది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేని డిజిటలైజేషన్ లేదు.
* రికార్డులను ఆన్లైన్ చేసినా, డిజిటలైజేషన్ చేసినా ప్రయోజనం నామమాత్రమే. ప్రస్తుత హక్కుదారులెవరో వీక్షించగలరు. కానీ ఆ భూమి వారికి ఎలా సంక్రమించిందన్న వివరాలేవీ కనిపించవు, అంతుచిక్కదు. ఇప్పుడు ఏ ఆస్తిని కొనుగోలు చేయాలన్నా అమ్మకందారుడికి ఎలా వచ్చిందన్న అంశంలో కనీసం 30 ఏళ్ల రికార్డులనైనా పరిశీలించాలి. మరి ధరణి పోర్టల్‌లో పొందుపర్చలేదు. మళ్లీ ఫిజికల్ రికార్డులను వెరిఫై చేయాల్సిందే.
* ఏదైనా ఆస్తికి సంబంధించిన లావాదేవీలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అది ధరణి ద్వారా సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు. ఏదైనా మార్పు చోటు చేసుకున్నా ప్రతి ఒక్కరూ గుర్తించేలా టెక్నాలజీ లేదు. మార్పును చాలా కాలం పాటు గుర్తించని కారణంగా వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
బ్లాక్ చైన్టెక్నాలజీతో పరిష్కారం
* భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయకుండా చేయొచ్చు.
* ఆన్లైన్లో వివరాలు ఉంటాయి. ప్రస్తుత హక్కుదారుడి వివరాలతో పాటు ఆయనకు ఎలా సంక్రమించిందో కూడా చూపించొచ్చు. ఆస్తిపై చోటు చేసుకున్న ప్రతీ లావాదేవీని ఒక్క క్లిక్‌ద్వారా కనిపించేటట్లు చేయొచ్చు.
* ప్రతి భూ లావాదేవీని అందరికీ చూపించడం ద్వారా అక్రమాలకు తావులేకుండా పరిపాలన సాగుతుంది.
* ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్వపు ప్రతి లావాదేవీని, ఇక ముందు జరగబోయే ప్రతి క్రయ విక్రయాన్ని నమోదు చేయొచ్చు.
* ఒక్క కంప్యూటర్లోనే కాదు. అనేక డివైస్ ల్లో డేటాను సేవ్ చేయొచ్చు. ఏ చోట చిన్న మార్పును చేసినా అన్ని చోట్ల కనిపిస్తుంది. దీంతో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు.
* ఓపెన్లెడ్జర్ : గూగుల్ అందరికీ యాక్సెస్ ఇచ్చినట్లే, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా ఈ డేటాను అందరికీ యాక్సిస్ ఇవ్వొచ్చు. భూ రికార్డులపై అప్పుల వివరాల నమోదు, కౌలు వివరాలు వంటి ప్రతి అంశాన్ని నమోదు చేసుకోవచ్చు.
* కార్పొరేట్ఆస్పత్రుల్లో పేషెంట్ఐడీ చెబితే చాలు లేదంటే మొబైల్ నెంబర్ చెబితే చాలు గతంలోని ప్రిస్క్రిప్షన్లన్నీ కంప్యూటర్ లో కనిపిస్తాయి. బ్లాక్చైన్టెక్నాలజీని అనుసరించడం ద్వారా సాధ్యమైంది. భూ రికార్డుల్లోనూ అదే విధానాన్ని అనుసరించడంతో పారదర్శకత లభిస్తుంది.
* ఉమ్మడి రాష్ట్రంలో సీసీఎల్ఏగా అనిల్‌చంద్ర పునీత కాలంలోనే భూ పరిపాలనలో బ్లాక్చైన్టెక్నాలజీని వినియోగించాలని ప్రతిపాదించారు. కానీ, రాజకీయ పక్షాల చొరవ లేకపోవడంతో ప్రతిపాదనగానే మిగిలిందన్న ఆరోపణలు ఉన్నాయి.
సర్వేల్లో డ్రోన్లు..
దేశంలో భూముల సర్వేలోనూ ఆధునిక పద్ధతులు అనేకం అందుబాటులోకి వచ్చాయి. గుర్రాలతో మొదలై కట్టెలు, ఇనుప చైన్లతో ఎక్కువ కాలం సాగింది. ఈపీఎస్, జీపీఎస్, డీజీపీఎస్ విధానాలను అనుసరిస్తున్నారు. తాజాగా డ్రోన్ల వినియోగం ద్వారా 99 శాతం అక్యురేట్సాధించే సర్వే పద్ధతులు వచ్చాయి. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులకు వినియోగించారు. ప్రైవేటు సంస్థలైతే అనేక ప్రాజెక్టుల్లోనూ సద్వినియోగం చేసుకున్నాయి. ఇప్పుడు పల్లెల్లోనూ ఏ ఈవెంట్జరిగినా డ్రోన్ ఎగురుతూ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ ప్రాజెక్టులోనూ డ్రోన్ల సాయం తీసుకుంటుంది.
ప్రతి ఇంటికి స్వమిత్వ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విధానాన్ని భూముల సర్వేకు వినియోగించడం ద్వారా అక్యూరసీ పెరుగుతుంది. ప్రతి ఆస్తికి ఇమేజ్ రూపొందడంతో సరిహద్దుల వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. పైగా తక్కువ కాలంలోనే సర్వే పూర్తి చేసే ప్రక్రియ అని నల్సార్‌వర్సిటీ ప్రొ.ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ సమగ్ర భూ సర్వే చేపడితే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదన్నది సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా ఏడాదిలోనే సర్వే పూర్తి చేసే పద్ధతుల వైపు ప్రభుత్వం యోచించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
అతి తక్కువ ఖర్చుతోనే చేయొచ్చు : ప్రొ.ఎం.సునీల్ కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్
భూ పరిపాలన ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనే కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్, యూఎన్డీపీ భూ పరిపాలనలో బ్లాక్చైన్టెక్నాలజీని అమలుకు ప్రతిపాదిస్తున్నాయి. ఇప్పటికే హర్యానాలో పైలెట్‌ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది. ఏపీలోనూ సమగ్ర సర్వేకు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించాలని ప్రతిపాదించారు. నీతి అయోగ్ ఇప్పటికే ఢిల్లీలో బ్లాక్ చైన్ వినియోగంపై అన్ని రాష్ట్రాలతో వర్క్ షాప్ నిర్వహించి పాలసీ పత్రాన్ని కూడా విడుదల చేసింది.
అతి తక్కువ ఖర్చుతో ఉన్న ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. భూ సర్వేలోనూ ఆధునిక డ్రోన్లతో మెరుగైన ఫలితాలు సాధించొచ్చని రుజువైంది. డ్రోన్ల సర్వేతో ప్రతీ ప్రాపర్టీకి చెందిన ఇమేజ్ ను పొందడంతో సరిహద్దు వివాదాలు లేకుండా ఉండొచ్చు. ఒక మండలాన్ని నెల రోజుల్లో సమగ్ర సర్వే చేయొచ్చు. ఏడాదిలో రాష్ట్రం మొత్తం సర్వే చేయగల డ్రోన్ల విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలోనూ ఆధునిక టెక్నాలజీని వినియోగించాలి.






