బీజేపీ బౌన్స్.. నాలుగు నుంచి 48 స్థానాలు

by  |
బీజేపీ బౌన్స్.. నాలుగు నుంచి 48 స్థానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీవిని ఎరుగని తరహాలో బీజేపీ పుంజుకున్నది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బలీయమైన పార్టీగా నిలిచింది. గత సీట్లకు 12 రెట్లు డివిజన్లను పెంచుకుని జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2016లో కేవలం నాలుగు డివిజన్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 48 డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలనే టార్గెట్ చేస్తూ నిర్వహించిన ప్రచారం బీజేపీకి ఆశించిన దానికంటే అధికంగానే ఫలితం చేకూర్చిందని పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ ఎన్నికల ద్వారా అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందనే సంకేతాలను వెలువరించింది. జాతీయస్థాయి నాయకులను ఎన్నికల ప్రచారానికి రప్పించి గ్రేటర్ లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు దోహదం చేసింది. ఈ గెలుపుతో శివారు నియోజకవర్గాలతో పాటు నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ పాగా వేసింది.

జాతీయ నేతల ప్రసంగాలతో..

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేశారు. వారు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. నగరంలో రెండో అతి పెద్ద పార్టీగా నిలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, జాతీయ నాయకులు భూపేంద్ర యాదవ్, సంబిత్ పాత్ర తదితరులు చేసిన ప్రచారంతో గ్రేటర్లో పార్టీ బలంగా ఎదిగేందుకు దోహదం చేసింది. మునుపెన్నడూ లేనివిధంగా విస్తృత ప్రచారం లభించింది. దీంతో నగరవాసుల దృష్టిని కాషాయం వైపు మళ్లించింది. ఇది అభ్యర్థులకు లాభం చేకూరింది.

ఎల్ బీనగర్ లో స్వీప్..

నగర శివారులోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా బీజేపీ తన అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ మొత్తం 11 డివిజన్లలోనూ బీజేపీ జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఒక్క రామక్రిష్ణాపురం డివిజన్ కే పరిమితమైన కాషాయం ఇప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో నగర దృష్టంతా ఇటువైపే పడింది. ఇన్ని సీట్లు ఎలా గెలిచారనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలస్తున్నది. ఉప్పల్ లో 2 డివిజన్లు, మల్కాజిగరిలో 3, రాజేంద్రనగర్ లో 3, మహేశ్వరంలో 2, సనత్ నగర్ లో 3, ముషీరాబాద్లో 5, అంబర్ పేట్ లో 2 వంటి నియోజకవర్గంలో తన ఉనికిని నిలబెట్టుకుంది. నగరంలో బీజేపీ గెలిచిన డివిజన్లు మినహాయిస్తే మిగతా డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. కొన్ని డివిజన్లలో అతి స్వల్ప తేడాతో ఓడిపోయింది.

ఓడిన ఎమ్మెల్యే భార్య..

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నారెడ్డి హబ్సిగూడ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్. ఈ ఎన్నికల్లో మరల అదే డివిజన్ నుంచి రంగంలోకి దిగిన ఆమె బీజేపీ అభ్యర్థి చేతన హరీశ్ చేతిలో ఓటమిని చవిచూశారు. ముందుగా ఆమె ఆధిక్యంలోకి వచ్చినా.. చివరకు బీజేపీ అభ్యర్థి గెలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో 3 డివిజన్లను బీజేపీ స్వాధీనం చేసుకుంది. అమీర్ పేట్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్ లోనూ గెలిచింది.


Next Story

Most Viewed