రెండు కారణాల వల్లే పోలీసులలకు అపఖ్యాతి : అమిత్ షా

70
amit-shah

న్యూఢిల్లీ : పోలీసులు ముఖ్యంగా రెండు కారణాల వల్లే అపఖ్యాతి పాలవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అందులో ఒకటి అసలు చర్యలే తీసుకోకపోవడమైతే, రెండోది తీవ్రమైన చర్యలు తీసుకోవడం అని చెప్పారు. నిర్లక్ష్యంతో లా అండ్ ఆర్డర్ వ్యవస్థను సరైన మార్గంలో ఉంచలేమని, అందువల్ల ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండటం సరైనది కాదన్నారు.

అలాగే, ప్రతిచర్యను ప్రేరేపించే తీవ్రమైన చర్య సైతం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాబట్టి పోలీసులు వీటి నుంచి బయటపడి, పరిస్థితికి తగినట్టు కేవలం చర్య తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప సరోజిని నగర్‌లో ఫోరెన్సిక్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్‌కు అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్థ గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెన్ యూనివర్సిటీతో కలిసి పోలీసులకు సహజ మార్గంలో విధులు నిర్వర్తించేలా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. నేటి పోలీసు వ్యవస్థ 20ఏళ్ల క్రితం ఊహించినదానికే పరిమితం అవలేదని, నకిలీ నోట్లు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం, సైబర్ క్రైం, గోవుల అక్రమ రవాణా వంటి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని తెలిపారు.

‘నేడు యూపీలో నాటిన ఫోరెన్సిక్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ అనే విత్తనం ఏదో ఒకరోజు మర్రిచెట్టు అవుతుంది. అప్పుడు అనేక మంది విద్యార్థులు ఇక్కడి నుంచే తమ కెరీర్‌ను నిర్మించుకుంటారు. దేశ శాంతి భద్రతలకు వెన్నుముక అవుతారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా సగానికిపైగా రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ సైన్స్ కాలేజీలు ఏర్పాటు అవుతాయి’ అని అమిత్ షా తెలిపారు.

శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయి

దేశంలో శిక్షారేటు తక్కువగా ఉందని అభిప్రాయపడిన ఆయన ఇజ్రాయిల్ వంటి దేశాల్లో ఇది 90శాతం వరకు ఉందని తెలిపారు. ఈ విషయంలో భారత్ వెనుకబడి ఉందని, వృత్తిపరమైన విద్య లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. శిక్షలు అమలైన చోటే క్రైం రేటు ఆటోమెటిక్‌గా తగ్గుతుందని స్పష్టంచేశారు. ఇందుకు ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ దోహదపడుతుందని తెలిపారు.

యూపీలో భారీ మెజారిటీతో గెలుస్తాం.. అమిత్ షా

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, తిరిగి అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రతిపక్ష నేతలు ఓటమికి సన్నద్ధమవ్వాలని సూచించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీ అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు. 44 సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెరుగుపడడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, యోగి ప్రభుత్వంలో అవినీతి అడ్డుకట్ట పడిందని ప్రశంసలు కురిపించారు. కొవిడ్ సమయంలో యోగి, ఆయన బృందం అద్భుత పనితీరును కనబర్చిందని తెలిపారు.

ప్రతిపక్షాలు అప్పుడు ఎక్కడున్నాయి?

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్షాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని, ప్రజలు వారిని నమ్మరని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా ఉన్నప్పుడు, అల్లర్లు చెలరేగినప్పుడు, మహిళలపై దాడులు జరిగినప్పుడు, కుటుంబాలకు మరుగుదొడ్లు కూడా లేనప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎక్కడున్నాయని నిలదీశారు. ఒక కులం కోసమో, కుటుంబం కోసమో బీజేపీ పనిచేయదని, పేదల్లో అత్యంత పేదల కోసం పనిచేస్తుందని చెప్పారు.

యూపీ అభివృద్ధి ఘనత మోడీ, అమిత్ షాకే దక్కుతుంది: యోగి

యూపీ అభివృద్ధి చెందడానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కారణమని, ఈ ఘనత వారికే దక్కుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిందని, కానీ, ఇంతకుముందు పార్టీలకు అందుకు సమయం లేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..