‘హస్తం’పై కమలం ఫోకస్​..

by  |
‘హస్తం’పై కమలం ఫోకస్​..
X

‘చే’జారుతున్న వారిని లాగిన తర్వాత ‘కారు’ దిగే నాయకులకు లిఫ్ట్​ ఇవ్వడానికి బీజేపీ ప్రణాళికారచన చేస్తోంది. గ్రామస్థాయి నుంచి పాగా వేయడానికి పక్కా ప్లాన్​ చేస్తోంది. ఇదే సరైన సమయం పార్టీని బలోపేతం చేయడానికి కలిసొస్తుందని నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉనికి ప్రమాదంగా ఉన్న కాంగ్రెస్​ నేతలు కాషాయం వైపు చూస్తుండగా చేర్చుకోవడానికి చర్చలు జరుపుతుంది. ఆ తర్వాత గులాబీ గూటి నుంచి అసంతృప్తులను లాక్కోవడానికి మంతనాలు నెరుపుతుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ స్టాండ్​ మారింది. ఓ వైపు గ్రేటర్​ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూనే అటు నేతలను చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ముందుగా కాంగ్రెస్​ను ఖాళీ చేయించి ఆ తర్వాత అధికార పార్టీ నేతలను టార్గెట్​ చేయనుంది. ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీ నేతలతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రామం నుంచి గేమ్..​

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ గరికపాటితో పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన నేతలంతా బీజేపీలో చేరారు. అనంతరం కాంగ్రెస్​ నేతలపై గురి పెట్టారు. బీజేపీ అధిష్టానం కూడా అదే పంథా అమలు చేయాలని చెప్పడంతో గ్రామస్థాయి నేతల నుంచి రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్​ నేతలకు వల వేస్తోంది. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​ వరకు నేతల జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత, నిర్మల్​ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్​ జిల్లాకు చెందిన సీనియర్​ నేత కూడా చేరుతున్నట్లు తేలిపోయింది.

నేతల వరుసలు..

అంతకు ముందే కాంగ్రెస్​ నుంచి డీకే అరుణ, టీఆర్​ఎస్​ నుంచి ఎంపీ జితేందర్​రెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరారు. గ్రేటర్​ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్​, రవి యాదవ్​తో పాటు స్థానికంగా ఉండే చాలా మంది నేతలు బీజేపీలో చేరారు. తాజాగా కాంగ్రెస్​ సీనియర్లు విజయశాంతి, సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖరారు కాగా, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, అంజన్​ కుమార్​ యాదవ్​, విక్రం గౌడ్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

బీజేపీ వైపే మొగ్గు..

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నేతల దృష్టి మొత్తం బీజేపీ వైపు ఉంటోంది. టీఆర్​ఎస్​లో ఇప్పటికే కేడర్​ ఫుల్​గా ఉంది. అందులోకి వెళ్లితే ఎదుగూ బొదుగు ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు గులాబీ కండువా కప్పుకుని కనిపించకుండా పోయారు. మండలాలు, డివిజన్లలో ఇలాంటి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోంది. బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్​ పెట్టారు. ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించి, తెలంగాణ తొలి శాసనమండలి ఛైర్మన్​గా వ్యవహరించిన స్వామిగౌడ్​ కూడా బీజేపీకి జై కొడుతున్నారు. దీంతో కాంగ్రెస్​ నేతలకు ప్రత్యామ్నాయంగా కాషాయ జెండా కనిపిస్తోంది.

అసంతృప్తుల జాబితా..

కాంగ్రెస్​తో పాటు టీఆర్​ఎస్​ పార్టీలో అసంతృప్తి నేతలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్​ పెట్టింది. అధికార పార్టీలో ఉన్న సీనియర్​ నేతలు, పదవులు రాకుండా ఎదురుచూపుల్లోనే ఏండ్లు గడుపుతున్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతకు ఇదే విధంగా వల వేసిన బీజేపీ… ఉద్యోగ సంఘాల నుంచే మరో నేతకు ఆఫర్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి ప్రభుత్వంలో ఓ కార్పొరేషన్​ చైర్మన్​గా చేసి ప్రస్తుతం పదవి కోసం ఎదురుచూస్తున్న సదరు నేతతో మంతనాలు చేస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్​కు చెందిన నేత, వరంగల్​ జిల్లాకు చెందిన మరో సీనియర్​ నేతతో కూడా చర్చలు సాగిస్తోంది.

తర్వాత టీఆర్​ఎస్​ నుంచి..

వరంగల్​ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్​ సీనియర్​ నేతకు కూడా బీజేపీ ఆఫర్​ ఇచ్చింది. ఆ తర్వాతనే టీఆర్​ఎస్​ నేతలను టార్గెట్​ చేయాలని బీజేపీ అధిష్టానం కూడా ప్రణాళిక చూపించింది. ఇంకో ఏడాదిలో టీఆర్​ఎస్​లో అసంతృప్తి చాలా పెరుగుతుందని, ఆ సమయంలోనే ఛాన్స్​ తీసుకుని పార్టీలోకి తీసుకురావాలని ఢిల్లీ నుంచి సంకేతాలిచ్చారు. అయినప్పటికీ టీఆర్​ఎస్​లో అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలు బీజేపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుతున్నారు.


Next Story

Most Viewed