‘పద్మ’వ్యూహం.. చిక్కుల్లో ఎంఐఎం, టీఆర్ఎస్

418

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రణాళికలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే.. ఓ వైపు ‘చేంజ్ హైదరాబాద్’, మరో వైపు ‘బస్తీ నిద్ర’, ఇంకోవైపు ‘క్లీన్ పాలిటిక్స్’ అంటూ నూతన పద్దతులను ఎన్నికల ప్రచారంలోకి తీసుకొస్తుంది. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ ఎన్నికల ప్రసంగం చేయడం వంటివి కొత్త ప్రయోగాలు చేసింది బీజేపీ. ఈ మారు మునుపెన్నడూ లేనివిధంగా ఎంఐఎం పార్టీని టార్గెట్ చేసింది. హిందువుల ఐక్యతను బలంగా వినిపిస్తోంది. సాధారణంగా జరిగే రోడ్ షోలు కొనసాగిస్తూనే… అధికార టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై , సీఎం పనితీరుపై, కేటీఆర్ ప్రకటనలపై, నగర వాతావరణంపై బీజేపీ విమర్శణారోపణలు సంధిస్తోంది. గ్రేటర్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వరద సాయం ప్రకటిస్తోంది.

యువత కోసం‘చేంజ్ హైదరాబాద్’

నగరంలో ప్రజలు ‘మార్పు’ కోరుకుంటున్నారని బీజేపీ పదేపదే చెబుతూ ఓటర్లు నిజంగా మారేలా నినదిస్తున్నది. బీజేపీకి ఒక్కమారు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రజల్లో మార్పు వచ్చేలా చేస్తోంది. ఈ క్రమంలోనే అతిచిన్న వయస్సులో పార్లమెంట్ సభ్యుడు, బీజేవైఎం జాతీయ స్థాయి అధ్యక్షుడు తేజస్వి సూర్యను ఎన్నికల ప్రచారంలోకి దింపింది. గ్రేటర్ నగరాన్ని మారుస్తామని, భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చేంజ్ హైదరాబాద్ అంటూ సాంకేతికపరమైన యాప్ ను ప్రారంభించింది. ఎన్నికల కాంపేయిన్ అంటూ నగర వాసులు చేంజ్ కావాలంటున్నారని బీజేపీ వెల్లడిస్తున్నది. ముఖ్యంగా యువతను, అకట్టుకునేందుకు ‘చేంజ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఆయనతో ప్రారంభించింది. తెలంగాణ సెంటుమెంటును కూడా తమవైపు తిప్పుకునే క్రమంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడం, ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి తేజస్వి సూర్య వెళ్ళి ప్రసంగించడం కొత్త ఎత్తుగడలు వేసింది బీజేపీ.

ప్రమాణ పత్రంతో ‘క్లీన్ పాలిటిక్స్’

కార్పోరేటర్ గా పోటీచేస్తున్న అభ్యర్థితో ప్రజల సమక్షంలోనే ప్రమాణం చేస్తూ… మరో కొత్త ఆలోచనను ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రయోగించింది. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు… అభ్యర్థిచేత ప్రజా క్షేత్రంలోనే ప్రమాణం చేయించారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చేతన హరీష్ ప్రజల సమక్షంలో ప్రమాణ పత్రం చదివారు.

‘‘బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధిగా హబ్సిగూడ వార్డు నుండి పోటీ చేస్తున్న ‘చేతన హరీష్’ అనే నేను స్వచ్ఛమైన రాజకీయాలు (క్లీన్ పాలిటిక్స్) చేస్తానని, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

నా వార్డు పరిధిలోని బస్తీలు, కాలనీలు, అపార్ట్ మెంట్ల సభ్యులతో సంప్రదింపులు జరిపి రాగద్వేషాలకు అతీతంగా ప్రాధాన్యతల వారీగా వార్డు అభివృద్దికి చేపట్టాల్సిన కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తానని హామీ ఇస్తున్నాను. జాతీయ భావాలు, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేను పార్టీ సిద్దాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.’’ ఈ విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలకు బీజేపీ తెరలేపింది.

ఆ ప్రాంతంలోనే బస్తీ నిద్ర

ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రాత్రి వరకు సాగించి అనంతరం ప్రచారం ముగిసిన ప్రాంతంలోనే ఆ రాత్రి ఆ బస్తీలోనే నాయకులు నిద్రిస్తారు. దీంతో ప్రజల్లో మరింత ఆదరణ లభిస్తుందని బీజేపీ భావిస్తుంది. స్థానికుల్లో బీజేపీ ప్రజల పార్టీయని, ప్రజల్లోనే ఉంటుందన, ప్రజాభివృద్దిని కోరుకుంటుందనే సంకేతాలను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ దిశలోనే మరిన్ని ప్రయోగాలు, కొత్త పద్దతులతో ఎన్నికల ప్రచారాన్ని ఆసక్తికరంగా మార్చేస్తుంది బీజేపీ.