‘నామినేటెడ్‌’ బరిలో 12మంది.. లక్కు ఎవరికి చిక్కెనో?

by  |
‘నామినేటెడ్‌’ బరిలో 12మంది.. లక్కు ఎవరికి చిక్కెనో?
X

కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిపై కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. పాలక మండలి గడువు ముగిసి 15 రోజులు కావస్తున్నా నామినేటెడ్ పదవిని ఎవరికి కట్టబెడుతారనే అంశాన్ని ఎటూ తేల్చడంలేదు. దీంతో పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఎదురుచూపులు తప్పడంలేదు. పదవి ఎవరికి దక్కనుందోనని స్థానిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశవహులు సైతం నిత్యం ఢిల్లీకి పయనమవుతున్నారు. అధిష్ఠానం పెద్దల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తానికి ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పదవి కంటోన్మెంట్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

దిశ, కంటోన్మెంట్ : దేశంలోనే అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవీకి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ పదవి కోసం 12 మంది వరకు పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపనప్రతాప్, భానుక నర్మద మల్లికార్జున్, జే రామక్రిష్ణతోపాటు తాజా మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి నాలుగైదు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి పలువురిని కలిసినట్లు సమాచారం. మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ విజయరామారావు పేరు సైతం నామినేటెడ్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలోనూ విజయరామారావు పేరును స్థానికులు ప్రతిపాదన చేసి బీజేపీ అధిష్ఠానానికి నివేదించారు. అలాగే, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేశ్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి విన్నవించారు. వీరికి తోడు పార్టీ నేతలు దయానందచారి, గడ్డం శ్రావణ్ కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

రాష్ట్ర నాయకత్వ మద్దతు ఎవరికీ..?

నామినేటెడ్ పదవి దక్కాలంటే బీజేపీ రాష్ట్ర పెద్దల మద్దతు తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు కొంతకాలంగా పార్టీలో కీలకంగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తో పాటు హోంమంత్రి జీ కిషన్ రెడ్డి, ముఖ్య నేతలు డాక్టర్ లక్ష్మణ్​ తదితర నేతలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్డ్వ్​ అయినందున విజయరామారావుకు అవకాశం కల్పిస్తే రేపటి అసెంబ్లీ ఎన్నికలకు ప్రమోట్ చేసినట్లు ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు భానుక నర్మద రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు తనకే ఉందని, మహిళ కోటాలో తనను కేటాయించే అవకాశం ఉందంటున్నారు. మరో మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, గతంలోనూ నామినేటెడ్ సభ్యుడిగా చేసిన అనుభవం ఉందని, దత్తాత్రేయ, లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి పరిచయం ఉండడంతో తనకే వస్తుందన్న భావనలో ఉన్నారు. దీనికి తోడు వివిధ కాలనీవాసులు, కంటోన్మెంట్ కు చెందిన పలువురు ప్రముఖులు ప్రతాప్ పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ అధిష్ఠాననానికి లేఖలు రాసినట్లు తెలిసింది. అదేవిధంగా కంటోన్మెంట్ చట్టాలపై పూర్తి అవగాహన ఉండడంతో బోర్డులో పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు తనకు అవకాశం ఉందని జె.రామక్రిష్ణ ధీమాతో ఉన్నారు.. అయితే యువ నేత గడ్డం శ్రావణ్ కుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆయన పేరును, సీనియర్ నాయకుడు ఆకుల నగేశ్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తరచూ హస్తినకు పయనం..

నామినేటెడ్ పదవిని ఆశిస్తున్న పలువురు బీజేపీ నేతలు తరచుగా ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్రంలో ఏమి జరుగుతుందోనని ఆరా తీస్తున్నారు. తాము నమ్ము కున్న అధిష్ఠానం పెద్దలకు తరచూ టచ్ లో ఉంటూ ఆశీస్సులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చిన అధిష్ఠానం పెద్దల ముందు కనిపించేలా గంటల వ్యవధిలోనే దేశ రాజధానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ పెద్దల దృష్టిలో మంచి మార్కులు పడేలా ప్రయత్నిస్తున్నారు. నగరంలో చేపట్టే ఏ చిన్న కార్యక్రమానికైనా హాజరవుతూ ప్రజల్లో కనిపిస్తున్నారు. అయితే ప్రజాధరణను బట్టే నామినేట్ పదవి వస్తాయని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. దీంతో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల శ్రీ రామ మందిరం నిధి సేకరణలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. పదవి ఎప్పుడు వస్తుందని అనుచరులు అడిగినప్పుడల్లా అధిష్ఠానం ఆశీస్సులు, అదృష్టం కలిసి వస్తే పదవి వస్తుందని చెబుతూ జారుకుంటున్నారు. బీజేపీ అధిష్ఠానం పెద్దలు ఊగిసలాడడంతో నామినేటెడ్ పదవిపై నేతలు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కంటోన్మెంట్ లో కనిపిస్తోంది.


Next Story

Most Viewed