కేసీఆర్‌కు సవాల్ విసిరిన ఈటల.. అలా జరిగితే రాజకీయాల నుండి తప్పుకుంటా..

by  |
కేసీఆర్‌కు సవాల్ విసిరిన ఈటల.. అలా జరిగితే రాజకీయాల నుండి తప్పుకుంటా..
X

దిశ, కమలాపూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకనాడు ఈటల రాజేందర్ తన కుడి భుజం అని, నా తమ్ముడు అని, నాకు జీతం ఇచ్చేది కూడా ఈటల అని చెప్పిన కేసీఆర్‌కు ఈరోజు ఈటల దయ్యం ఎట్లా అయ్యాడో చెప్పగలవా అని ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. గత 18 సంవత్సరాల తరువాత ఎప్పుడూ రాని మంత్రులు, ఇతర పార్టీల నుండి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి గొర్ల మందల మీద తోడేళ్ళ వలె, పంట పొలాల మీద మిడతల లాగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కేసీఆర్, హరీశ్ రావులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

హరీశ్ రావు తనను అన్న మాటలు తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని, 18 సంవత్సరాలు పని చేసిన ఈటల హుజరాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయలేదని హరీశ్ రావు చెబుతున్నారన్నారు. ఈరోజు ఈటల ఒక్కనికే అన్యాయం జరగలేదని, గతంలో ఎన్నో సార్లు హరీశ్ రావు, నేను కన్నీళ్లు పెట్టుకొని బాధ పడ్డామని, అవమానాలకు గురి అయ్యామని అవన్నీ డేట్ తో సహా సందర్భం వచ్చినప్పుడు వివరిస్తానన్నారు ఈటల. ఈరోజు అవన్నీ మర్చిపోయి పదవుల కోసం సహచర మిత్రునిపై, ఉద్యమకారునిపై నీలాగా అవమానపడ్డ నాపై పిచ్చి కూతలు కూస్తే పలుచనైపోతావు అని హరీశ్ రావుకు హితవు పలికారు.

ఈటల చరిత్ర కేసీఆర్ వద్ద లేకపోయినా, తెలంగాణ ఉద్యమంలో ఉప్పల్ రైల్ రోకో చేసిన ఈటల చరిత్ర ఢిల్లీలో ఉందన్నారు. ఇంట్లో కూర్చుని చేస్తే తెలంగాణ రాలేదని, ఎంతోమంది ఉద్యమకారుల, విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని, తెలంగాణ సాధనలో తమ వంతు కీలకపాత్ర ఉందని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం భయంతో వణుకుతున్న సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా నా విధిలో నేను ఉంటే, నాపై భూ ఆక్రమణ ఆరోపణలు చేసి టీ న్యూస్‌లో దుష్ప్రచారాలు చేశారన్నారు. ఒక్కరోజులోనే అధికారులతో సర్వే చేసి నన్ను బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. 2001లో నా ఆస్తులు ఎన్నో లెక్క చెబుతానని, కేసీఆర్ ఆస్తి ఎంతో చెప్పాలన్నారు.

సోషల్ మీడియా, పత్రికలలో కేసీఆర్ ప్రభుత్వానికి 84 శాతం వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని, తెలంగాణకు హుజూరాబాద్ నియోజకవర్గం ఆదర్శం కాబోతుందన్నారు. ప్రతి పేదవారికి కులాలతో సంబంధం లేకుండా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్, హరీశ్ రావు లు తనపై పోటీ చేయాలన్నారు. పోలీసులు, అధికారులు, మంత్రులు, డబ్బులను వాడకుండా తనపై గెలవాలని, తనపై గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఒకవేళ తాను గెలిస్తే రాజీనామా చేస్తారా.. అని ఈటల సవాల్ విసిరారు.


Next Story

Most Viewed