ఆ పద్ధతిలో హుజూరాబాద్‌ ఎన్నికలు జరపండి: బీజేపీ నేతలు

by  |
ఆ పద్ధతిలో హుజూరాబాద్‌ ఎన్నికలు జరపండి: బీజేపీ నేతలు
X

దిశ, కరీంనగర్ సిటీ: హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చర్యలు చేపట్టాలని.. కేంద్ర ఎన్నికల పరిశీలకులను బీజేపీ నేతలు కోరారు. శనివారం కరీంనగర్‌లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ బృందం కేంద్ర ఎన్నికల పరిశీలకులను కలిశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఇతర అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికార పార్టీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వ్యవహారాలపై దృష్టి సారించాలన్నారు. నిర్భయంగా ఓటు హక్కును హుజూరాబాద్ ప్రజలు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల పరిశీలకులను కలిసినవారిలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, హనుమకొండ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆంతోని రెడ్డి, నల్ల భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed