విడాకులకు సిద్ధమైన బిల్‌గేట్స్ దంపతులు

118

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ ఆయన సతీమణి మిలిందా గేట్స్‌తో విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు. సోమవారం అర్థరాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ జంట.. విడిపోతున్నట్టు ప్రకటించగానే ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

బిల్ గేట్స్ విడాకుల ప్రకటన చేస్తూ.. ‘ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాత మా బంధాన్ని తెంచుకోవాలని నిశ్చయానికి వచ్చాం. గడిచిన 27 ఏళ్లలో మేము ముగ్గురు మంచి పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచంలో అందరూ ఆరోగ్యకరంగా, నాణ్యమైన జీవితాన్ని జీవించేందుకు మా ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నాం. మేం విడిపోయినా గేట్స్ ఫౌండేషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం..’ అని ఆయన ట్వీట్ చేశారు. మిలిందా గేట్స్ కూడా ఇదే ట్వీట్ చేశారు.

ప్రపంచ కుబేరులుగా ఉన్నా దానధర్మాలు చేయడంలో దానకర్ణులు అనిపించుకున్న ఈ జంట.. సమాజంలో నెలకొన్న వందలాది సమస్యలపై పరిష్కారానికి పనిచేస్తు్న్నది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కోట్లు వెచ్చించి విద్య, వైద్యం, సమానత్వం కోసం స్థానికంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నది. భారత్‌లో కూడా ఈ సంస్థ కార్యకలాపాలున్నాయి. 1994 లో బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌లు పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..