బిగ్ బ్రేకింగ్.. మంత్రి గంగులకు బిగ్ షాక్.. కేసీఆర్ రియాక్షన్ ఏంటి.?

2055

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్​అక్రమ రవాణాపై ఈడీ కొరడా ఝుళిపించింది. మైనింగ్​శాఖ నుంచి పొందిన అనుమతికి మించి గ్రానైట్ తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దందాకు పాల్పడుతున్న 9 మైనింగ్​ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కంపెనీల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ​కుటుంబీకులకు చెందిన శ్వేతా ఏజెన్సీస్ ​సైతం ఉండటం గమనార్హం. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గ్రానైట్​ నిక్షేపాలున్నాయి.

ఇక్కడి కంపెనీలు గనులశాఖ నుంచి అనుమతి పొందిన దాని కన్నా ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేశాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల వద్దకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. మైనింగ్ శాఖకు చూపిన సైజులకు, విదేశాలకు ఎగుమతయ్యేందుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్‌కు భారీ తేడాను గుర్తించారు. వివరాలు సేకరించిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రిపోర్ట్ నంబర్ 60, సీ నెంబర్ 268/ఎన్‌ఆర్‌ఐ/ 2013 ప్రకారం మే 29న మైనింగ్​శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

ఆయా ఏజెన్సీల నుంచి పెనాల్టీతో సహా సీనరేజ్ ఫీజు వసూలు చేయాలని సైతం సూచించింది. రూల్ 26 (3)/ (i) (ii), ఏపీ ఎంఎంసీ రూల్స్ 1966 ప్రకారం పెనాల్టీతో సహా సీనరేజ్ వసూలు చేయాలని కోరింది. ఈ మేరకు కరీంనగర్‌కు చెందిన ఏడు సంస్థలు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, పెద్దపల్లి, కరీంనగర్, గంగాధర, ఉప్పల్, జగిత్యాల రైల్వే స్టేషన్ల నుంచి గ్రానైట్ బ్లాకులను తరలించాయని తెలిపింది. ఈ మేరకు పెనాల్టీతో సహా రూ. 749,66,76,882 వసూలు చేయాలని మైనింగ్​శాఖకు ఇచ్చిన నివేదికలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం పేర్కొంది. దీనిపై ఫిర్యాదులు వెళ్లటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆయా ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసింది.

ఫిర్యాదుల పరంపర..

2019లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గ్రానైట్​ అక్రమ తరలింపుపై పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిలు ఈడీకి, సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారి ద్వారా పూర్తి వివరాలను సేకరించిన ఈడీ కరీంనగర్‌లోని 9 గ్రానైట్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసింది. ఆయా ఏజెన్సీలు ఎంత పరిణామంలో గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారో చెప్పాలని కోరింది. ఆయా ఏజెన్సీలపై ఫెమా నిబంధనలు కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కొంప ముంచిన ఇంటర్వ్యూ..

రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాము నిబంధనలకు అనుగుణంగానే మైనింగ్ చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. గ్రానైట్ అవకతవకలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే గ్రానైట్ వ్యాపారుల మెడకు ఉచ్చును బిగించాయని చెప్పవచ్చు. దీంతో, మరోమారు రంగంలోకి దిగిన కొందరు నిబంధనలు ఉల్లంఘించి మెమోలు జారీ చేయడం చట్ట విరుద్ధమని, అసలు గ్రానైట్ ఏజెన్సీలు అవకతవకలపై మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెల్లించిన డబ్బు ఎంత అన్న వివరాలు తెలుసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలైన అర్జీలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు సదరు ఏజెన్సీల ద్వారా రూ. 11,08,55,936 మాత్రమే కలెక్ట్ చేశామని అధికారులు సమాచారం ఇచ్చారు.

అసలెంతా.. కట్టాల్సింది ఎంత..?

రూ. 124,94,46,147 కోట్ల మేరకు రాయల్టి ఎగవేశారని ఇందుకు అదనంగా ఫైవ్ టైమ్స్ పెనాల్టీ కలిపితే రూ. 624,72,30,735 కోట్లు వసూలు చేయాలని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. సెప్టెంబర్ 2, 2016న రాష్ట్ర ప్రభుత్వం 6581/ఎం.ఐ(1)/2016-1 మెమో జారీ చేయగా, డీఎం&జీ హైదరాబాద్ సెప్టెంబర్ 8 2016న మెమో నెంబర్ 6665/ఆర్​1-3/2016ను మెమో జారీ చేశారు. ఈ మేరకు ఆయా ఏజెన్సీల నుంచి వన్ ప్లస్ వన్ పెనాల్టీ తీసుకోవాలని ఆదేశించారు.

మైనింగ్‌లో జరిగిన అక్రమాలకు ఎలాంటి మినహాయింపు ఉండదని, గతంలో సింగరేణి సంస్థ విషయంలో హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఫిర్యాదు దారుడు భేతి మహేందర్ రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ వ్యాపారుల నుంచి సీనరేజ్‌ను ఐదు రెట్ల పెనాల్టీతో సహా వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలనుకుంటే చట్ట సవరణ చేయాల్సిందే తప్ప మెమోలు జారీ చేయడం నిబంధనలకు విరుద్దమని అంటున్నారు.

నేడో రేపో సీబీఐ..

కరీంనగర్ గ్రానైట్ మాఫియా వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌తో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. నేడో రేపో సీబీఐ సైతం రంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. గ్రానైట్ ఏజెన్సీలు ఎంత విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు, సైట్లలో ఎంత మేర తవ్వారు అన్న విషయాలతో పాటు ఏజెన్సీల లావాదేవీలు, విదేశాల నుంచి వచ్చిన డబ్బు బ్యాంకుల ద్వారా వచ్చింది ఎంత అన్న వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంటుంది.

పట్టువదలని విక్రమార్కుడు..

2013లో కరీంనగర్ గ్రానైట్ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టకపోవడంతో ఈడీ, సీబీఐ, పీఎంవోలకు ఫిర్యాదు చేశారు. అలాగే కంట్రోలర్ ​అండ్ ఆడిట్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. మొదట ప్రధాని కార్యాలయం నుంచి వివరాలు అడగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో భాస్కర్ రెడ్డి కాగ్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే మంత్రి గంగులపై ఆరోపణలు రావడంతో పాటు.. ఆయన కుంటుంబ సభ్యులు సైతం ఈ దందాలో ఉండటంతో జిల్లాలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. మంత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే చర్చ నడుస్తోంది.

120 ఎకరాల సీలింగ్ భూమిపై కన్నేసిన తెలంగాణ బీజేపీ నేత.. గ్రామస్తుల ఆందోళన

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..