మినీ ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ ప్యాకప్.. ఇదేమైనా బహుబలి సెట్టింగ్‌ హా..!

by  |
మినీ ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ ప్యాకప్.. ఇదేమైనా బహుబలి సెట్టింగ్‌ హా..!
X

దిశ, నాగర్ కర్నూల్: కెమెరా.. రోల్.. యాక్షన్.. ఒక సినిమా తీసేందుకు దర్శకులు, నటీ, నటులు సినిమా సెట్టింగ్‌ల వద్ద చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కానీ, సినిమా షూటింగ్ తర్వాత సెట్టింగ్‌లన్నీ మళ్లీ తొలగించడం పరిపాటి. అచ్చం ఇలానే నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద ప్రతి ఏటా దసరాకు 10 రోజుల ముందు హడావిడిగా చేసే పనులు, లైటింగులు దర్శనం ఇస్తాయి. ఆ తరువాత మాత్రం అంతా ప్యాకప్..!

పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువు కట్టపై ప్రతి ఏటా దసరాకు సుమారు లక్షలాది జనం వచ్చి జమ్మి చెట్టుకు పూజ నిర్వహించి, దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ నేపథ్యంలో కేసరి సముద్రం చెరువు కట్టను తెలంగాణ ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్‌గా మార్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి నూతన ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన జిల్లా ఏర్పాటు కోసం తాను ఎంతగానో కృషి చేశారు.

ఇందులో భాగంగానే మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోనే ఐకాన్ మోడల్‌గా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. దాని ఫలితంగానే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం ఎంతగానో దోహదపడిందని టీఆర్ఎస్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనుల్లో భాగంగా 2019 డిసెంబర్ ఎన్నికలకు ముందు చకచక పనులు జరిపించారు. సొంతంగా చెరువు మధ్యలో బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. లేజర్ లైట్స్ సిస్టం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ గత మూడేళ్ళ క్రితమే నిర్మించారు.

కానీ, ప్రస్తుతం వాటినే తొలగించి మళ్లీ నిర్మాణం చేయడంపై పట్టణవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమా సెట్టింగ్ మాదిరిగా నిర్మించి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాహుబలి సినిమా కోసం దర్శకుడు వివిధ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసినట్లు.. ప్రజలు ఎక్కువగా తిరిగే ట్యాంక్‌బండ్‌పై కొత్త కొత్త సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి.. చివరకు మళ్లీ తొలగించడం అంటే అభివృద్ధి కోసమా లేక ఓట్ల కోసమా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మండిపడుతున్నారు. మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ అంటే మరికొన్ని కొత్త పనులు చేపట్టాలి. కానీ, శరీరంపై ఉన్న బట్టలు ఉతికి వేసుకున్నట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టిన కొద్దిరోజులకే తొలగించడంపై ప్రజాధనం వృథా అవుతోందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

నాసిరకంగా ఉన్నాయనే తొలగింపు..

గతంలో నిర్మించినవి నాసిరకంతో తొలగిపోవడం వల్లే ప్రస్తుతం రూ. 3.50 లక్షల నిధులతో నూతన పనులు చేపడుతున్నాం. ఫుట్‌పాత్, రేలింగ్, బతుకమ్మ ఘాటు, లైటింగ్, లవ్‌ ఎన్‌జీకే‌ఎల్‌ను నూతనంగా నిర్మిస్తున్నాం. పార్కు కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నాం. -అన్వేష్, మున్సిపల్ కమిషనర్.


Next Story

Most Viewed