Virat Kohli, Rohit Sharma : భవిష్యత్తులో టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు..?

by  |
Virat Kohli, Rohit Sharma : భవిష్యత్తులో టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు..?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాకు ఎప్పుడూ ఒక్కరే కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటారు. ఫార్మాట్ ఏదైనా సరే కెప్టెన్ మాత్రం ఒక్కడే ఉంటాడు. భారత జట్టులో టెస్టులు, వన్డేలు, టీ20లకు ప్రత్యేకంగా ఆటగాళ్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లలో మాత్రం కెప్టెన్ కోహ్లీ మాత్రమే. భారత జట్టులో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఉండాలని బీసీసీఐ ఏరోజూ భావించలేదు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారం పెరిగిపోతున్నది. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు వాయిదా పడ్డాయి. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీసీ) పూర్తి గంగరగోళంగా మారిపోయింది. దీంతో రాబోయే రెండు ఏళ్లు వాయిదా పడిన సిరీస్‌లను ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. స్వదేశీ, విదేశీ పర్యటనలో టీమ్ ఇండియా ఫుల్ బిజీగా మారనున్నది. దీంతో పాటు ఐపీఎల్ కూడా ఆడాల్సి ఉన్నది. దీంతో కోహ్లీపై మరింతగా భారం పెరిగిపోతుండటంతో ఇద్దరు కెప్టెన్ల పద్ధతిపై బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెస్ట్ ఫార్మాట్‌కు ఒకరిని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మరొకరిని కెప్టెన్‌గా నియమించడం ద్వారా కోహ్లీపై భారం తగ్గించాలని బీసీసీఐ భావిస్తున్నది.

If Virat Kohli opening with me is right for Team India in T20Is, we will go ahead: Rohit Sharma

ఆ రెండు బోర్డుల బాటలోనే..

క్రికెట్ ప్రపంచంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), బీసీసీఐలను బిగ్ 3గా పిలుస్తుంటారు. ఈ మూడు బోర్డులు ఆదాయ పరంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డుల కంటే ముందుంటాయి. ఈసీబీ, సీఏ క్రికెట్‌లో ప్రయోగాలు చేస్తున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఒక కెప్టెన్‌ను, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మరో కెప్టెన్‌ను ఎన్నాళ్ల నుంచో ఆడిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టును టెస్ట్ క్రికెట్‌లో జో రూట్ నడిపిస్తుంటే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా టిమ్ పైన్, పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ ఉన్నాడు.

అంతే కాకుండా ఆ రెండు దేశాలు ఓకే సమయంలో రెండు వేర్వేరు జట్లను అంతర్జాతీయ క్రికెట్ ఆడించే సత్తా కలిగి ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం అతి సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ వెనుకబడి ఉన్నది. అయితే గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ కారణంగా ఎంతో మంది యువ క్రికెటర్లు పుట్టుకొచ్చారు. మంచి టాలెంట్ కలిగిన యువ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో వారితో మరో జట్టును కూడా తయారు చేసే అవకాశం ఉన్నది. భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. అదే సమయంలో మరో జట్టును శ్రీలంక పంపడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. అంటే ఒకే సమయంలో రెండు జట్ల ఫార్ములాకు బీసీసీఐ సిద్ధపడింది. అలాగే త్వరలో టెస్టు జట్టుకు ఒక కెప్టెన్‌ను, పరిమిత ఓవర్లు జట్టుకు మరో కెప్టెన్‌ను నియమించాలని కూడా భావిస్తున్నది.

ICC ODI Rankings: Virat Kohli, Rohit Sharma Consolidate Top Two Spots, Jasprit Bumrah Leads Bowling Chart

ఇంగ్లాండ్ పర్యటన తర్వాత నిర్ణయం?

భారత జట్టు ఇంగ్లాండ్‌కు జూన్ 2న వెళ్లనున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. ఆ తర్వాత సెప్టెంబర్ మూడో వారంలో పర్యటన ముగించుకొని యూఏఈ వెళ్లనున్నది. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు జరిగే సమయంలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పటికే శ్రీలంకలో టీమ్ ఇండియా బి టీమ్ పర్యటన కూడా ముగియనుండటంతో ఆ ఫలితాలను కూడా విశ్లేషించుకొని వేర్వేరు జట్లు, వేర్వురు కెప్టెన్ల ప్రణాళికను అమలు చేసే అవకాశం ఉంది.

కోహ్లీ కెప్టెన్‌గా లేకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సభ్యుడిగా ఉండే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఇదే విషయాన్ని మాజీ సెలెక్టర్ కిరణ్ మోరే కూడా అంటున్నారు. కోహ్లీ ఒక్కడిపైనే భారం వేయకుండా అతడికి కాస్త రిలీఫ్ ఇస్తే మంచిది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం బీసీసీఐ ఇద్దరు కెప్టెన్ల సిద్దాంతంపై కసరత్తు చేసే అవకాశం ఉన్నది అని కిరణ్ మోరే చెప్పారు. కాగా, గతంలో భారత జట్టు ఇద్దరు కెప్టెన్లను నియమించి విఫలమయ్యింది. అయితే అప్పటి పరిస్థితులు వేరని.. ఇప్పుడు బలమైన జట్టు అండగా ఉందని కిరణ్ మోరే చెబుతున్నాడు. మరి అది నిజంగా జరుగుతుందో లేదో ఇంగ్లాండ్ పర్యటన అయ్యే వరకు వేచి చూడాలి.


Next Story