ఐపీఎల్ రద్దుకే బీసీసీఐ మొగ్గు ?

by  |
ఐపీఎల్ రద్దుకే బీసీసీఐ మొగ్గు ?
X

దేశావ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఆ తర్వాతైనా ఎప్పుడు ఎత్తేస్తారనే విషయంపైన ఎలాంటి సూచన చేయలేదు. మరోవైపు పలు దేశాలు ఆరు నెలల పాటు అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధించాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13ను రద్దు చేయడానికి బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ రద్దయ్యిందని బీసీసీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి అనధికారికంగా ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కానీ, బీసీసీఐ మాత్రం అధికారిక ప్రకటన ఏదీ చేయకపోవడం గమనార్హం.

మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో బీసీసీఐ అధ్యక్షుడు, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, ఎనిమిది ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు ప్రత్యేకంగా వీడియో సమావేశం నిర్వహించారు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ నిర్వహించడం, విదేశీ ఆటగాళ్లు లేకుండా ఆడించడం వంటి పలు ఆప్షన్లను ఫ్రాంచైజీల ముందు బీసీసీఐ ఉంచినట్లు సమాచారం. అయితే అలా ఆడితే ఐపీఎల్ కళ తప్పుతుందని.. బ్రాండ్ వాల్యూ పడిపోతుందని ప్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. కష్టమో నష్టమో ఈ ఏడాదికి రద్దు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి, అదే విషయాన్ని బీసీసీఐతో తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఐపీఎల్ రద్దుకే బీసీసీఐ మొగ్గు చూపిందని పేరు తెలపడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా, ఆస్ట్రేలియాలో ఆరు నెలల వరకు విదేశీయుల రాకపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. ఒకవేళ వరల్డ్ కప్ రద్దయితే.. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలపై కూడా సాధ్యాసాధ్యాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.

Tags : IPL, WT20, BCCI, Lockdown, Video conference, Australia


Next Story

Most Viewed