ఐపీఎల్ సక్సెస్ కోసం బీసీసీఐ కొత్త రూల్స్

53

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం సిద్ధపడుతున్న సమయంలోనే ఐపీఎల్‌తో సంబంధం ఉన్న 35 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో నలుగురు క్రికెట్లు ఉండటం గమనార్హం. కాగా ఐపీఎల్ ఎలా నిర్వహిస్తారో చూసిన తర్వాతే అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో బీసీసీఐ ఎలాగైనా సరే ఐపీఎల్‌ను విజయవంతం చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నది. ఇందుకోసం ఇప్పటికే అమలులో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ)కు మరికొన్నింటిని అదనంగా జోడించింది. ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన 12 బయోబబుల్స్‌లో ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నది. ఇకపై ఏ ఒక్క క్రికెటర్, సహాయక సిబ్బంది, బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చూడటమే ఈ ప్రోటోకాల్స్ లక్ష్యం.

పెరగనున్న టెస్టులు.. ప్రత్యేక చెకింగ్

బీసీసీఐ గతంలో విడుదల చేసిన ప్రోటోకాల్స్ ప్రకారం బయోబబుల్‌లోకి ప్రవేశించక ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అప్పుడు నెగెటివ్ వస్తే బయోబబుల్‌లోకి పంపిస్తారు. ఆ తర్వాత ప్రతీ ఐదు రోజులకు ఒకసారి టెస్టులు చేస్తుంటారు. అయితే మారిన నిబంధనల ప్రకారం ప్రతీ రోజు క్రికెటర్లతో పాటు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయనున్నారు. ఎవరైనా పాజిటివ్ తేలితే వారిని వెంటనే ఐసోలేషన్‌కు పంపుతారు. వారికి సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ చేస్తారు. ఆటగాళ్లు బయోబబుల్‌లో కచ్చితంగా ప్రోటోకాల్స్ పాటించాలి. వారిని పర్యవేక్షించడానికి ప్రతీ జట్టుకు నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించారు.

కానీ ఇకపై వారి సంఖ్యను మరింతగా పెంచనున్నారు. ఆయా క్రికెట్ జట్లు ఇతర నగరాలకు ప్రయాణం అవుతున్న సమయంలో వారి కోసం ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక చెకిన్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. సాధారణ ప్రయాణికులతో వీరిని కలపకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపేలా ఇప్పటికే బీసీసీఐ ఏవియేషన్ మినిస్ట్రీతో సంప్రదింపులు జరుపుతున్నది. మరోవైపు ముంబయి వాంఖడే స్టేడియంలో ఉన్న గ్రౌండ్స్‌మెన్‌ను మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు స్టేడియం దాటి వెళ్లడానికి అంగీకరించరు. వాళ్ల కోసం స్టేడియంలోనే వసతి ఏర్పాటు చేశారు. ఈ ప్రోటోకాల్స్ అన్నీ వెంటనే అమలులోకి వచ్చాయని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

వారికెందుకు కరోనా?

అక్షర్ పటేల్, పడిక్కల్, నితీష్ రాణా, డేనియల్ సామ్స్ తొలుత వచ్చినప్పుడు కరోనా నెగెటివ్‌గానే ఉన్నారు. కానీ బయోబబుల్‌లోకి ప్రవేశించిన తర్వాత పాజిటివ్‌గా నిర్దారించబడ్డారు. ఇలా జరగడంపై బీసీసీఐ మెడికల్ బృందం ఆరా తీసింది. వారికి కరోనా బయటే సోకి ఉంటుందని.. అయితే కరోనా సోకిన ఒకటి రెండు రోజులకు పాజిటివ్‌గా టెస్టుల్లో కనపడదని అందుకే వారందరికీ నెగెటివ్ వచ్చిందని మెడికల్ టీమ్ స్పష్టం చేసింది. అక్షర్ పటేల్ అంతకు ముందు టీమ్ ఇండియా బయోబబుల్‌లో ఉన్నాడు. అయితే అతడు బబుల్ టూ బబుల్ ట్రాన్స్‌ఫర్ అవలేదు. మధ్యలో ఇంటికి వెళ్లి వచ్చినప్పుడే అతడికి కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్లు, గ్రౌండ్స్‌మెన్ అందరూ తొలి రోజుల్లో కరోనా బారిన పడ్డారు. బయోబబుల్‌లోకి వెళ్లి వారం గడిచిన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా బయోబబుల్ ప్రోటోకాల్స్ మరింత కఠినతరం చేసినట్లు బోర్డు పేర్కొన్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..