డంప్ యార్డులా బౌద్ధనగర్ పార్క్

by  |
Boudda Nagar Park
X

దిశ, సికింద్రాబాద్: ఏళ్లు గడుస్తున్నా బౌద్ధనగర్ పార్క్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. పార్కులో పచ్చదనం కరువై చెత్తా చెదారంతో నిండిపోయింది. పట్టించుకునే వారే కరువయ్యారు. వేసవిలోనైనా పార్క్ అభివృద్ధి పనులు చేపడుతారని స్థానికులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలు అడియాశలుగా మారాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

పార్కు ఎదుట కనకదుర్గా దేవాలయం ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు కొద్ది సేపు పార్క్ లో సేద తీరుదామంటే తాళం దర్శనమిస్తుంది. పార్కు తాళం ఎప్పుడు తీస్తారో, ఎవరు తీస్తారో తెలియని పరిస్థితి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి స్థానిక కాలనీల ప్రజలు వస్తుంటారు. ఆటపాటలతో పాటు యోగా చేస్తుంటారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో మరో పార్కు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు, అధికారులు మారినా బౌద్ధనగర్ పార్క్ రూపు రేఖలు మాత్రం మారడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

గతంలో ఉన్న కార్పొరేటర్ ధనంజన గౌడ్ అధికారులకు, నూతన కార్పొరేటర్ శైలజకు సమస్యను వివరించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కార్పొరేటర్ శైలజ బౌద్ధనగర్ పార్క్ ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవికి ముందే పార్క్ లో పచ్చదనంతో పాటు ఇతర ఆట వస్తువులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని మండిపడుతున్నారు. ఈ వేసవిలోనైనా సంబంధిత అధికారులు పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story

Most Viewed