బంజారాల సంస్కృతి… బహుబాగు..

by  |
బంజారాల సంస్కృతి… బహుబాగు..
X

దిశ, నాగార్జునసాగర్ : భారతదేశంలోని అనేక తెగలు, ప్రజల వస్త్రధారణలో అలంకరణలో లంబాడీ స్త్రీల వేషధారణనే ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ముఖ్యంగా అలంకరించుకొనే ఆభరణాలు ప్రాచీనతను ప్రతీకను సంతరించుకుంటాయి. ఇప్ప టికీ నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో లంబాడీల వేషధారణ దుస్తులు అలంకరణలు ఆచరణలో ఉన్నాయి. లంబాడీ పురుషులు వేషధారణలో ప్రత్యేకత ఏమీ లేదు. వారు ఆ కాలంలో ధరించే దుస్తులు మగవాళ్లకు ధోతి, ఖాదీ, అంగీ, తలకు 24 మూరల పెద్ద పెద్ద రుమాలు కట్టేవారు. భుజంమీద కండువా ధరించి చేతిలో చేతి కర్ర ఉండేది. చెవులకు బంగారు పోగులు, చేతికి వెండి కడియాలు ధరించేవారు. ఈ విధంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ ఆచరణలోనే ఉందని చెప్పవచ్చు. లంబాడీ స్త్రీల దుస్తులు అందమైన కుట్టుపనులతో ఉంటాయి. అద్దాలు పొదిగించిన కాంచళి (రవిక), కుచ్చుల పేటియా (లంగా), అద్దాలు రూపాయి బిళ్లలతో తయారు చేసిన గుమ్‌టో (ముసుగు) ను ధరిస్తారు. లంబాడీ స్త్రీల ఆభరణాలు అందంగా ఉండటమే కాక బరువుగా కూడా వుంటాయి. వీరు ముక్కుకు భూరియా ముక్కెరను చెవులకు వివిధరకాల ఆభరణములను, మెడలో హంస్‌లో గొలుసును, చేతులకు బలియ గాజులును వాంక్‌ డీ కడియాలును, చేతి వేళ్లకు చాస్‌ నగిషి కలిగినవి చల్లా నగిషిలేని మొదలైన ఉంగరాలను ధరిస్తారు. లంబాడీల్లోని సాంప్రదాయక ఆభరణాలు ఈనాడు మార్పులు ఎన్నో లోనవుతున్నాయి. ఆధునిక కాలంలోని నాగరిక ప్రభావంతో ఈ నగలన్ని అంతరించి పోతున్నాయి.

గాతే, హంస్‌, కాంచళి, గుగ్రో,గుంగ్‌టో, బళియా డోరి వాంక్‌డీ

నల్లగొండ జిల్లాలోని లంబాడీ ప్రజలలో ఇప్పుడు పాత ఆచారాలు పోయి కొంతవరకు దుస్తులలోను, పెళ్ళి సొమ్ములలోను మనుషులలోను మార్పులు వచ్చాయి. అయినా లంబాడీలు మాట్లాడే భాషలలో ఎలాంటి మార్పు రాలేదు. వారి గోత్రాలలో మార్పు రాలేదు. వారి గోత్రాలలో కొన్నికోడ్‌ నెంబర్లు ఉంటాయి. వారు వివాహాలు వారి గోత్రాలకు వ్యతిరేఖ గోత్రాల తోనే పెళ్ళి చేసుకోవాలి. ఈ పెళ్ళి ఆచారాలను తెలుగు ప్రజలు చూసి లంబాడీ మానవుడు అని అంటారు. పెళ్ళి అయినవరు అత్తవారింటికి రావడం బహు అరుదు. ఈ లంబాడీలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వరుసకు వీరు అన్నా చెల్లెలు అవుతారు. ఇలా ఎన్నో ఆచార కట్టుబాట్లు ఉన్న వీరికి ఆదేశాలు, పట్టుదల, పంతాలు కూడా ఎక్కువే.లంబాడీలు శిశువు జన్మించిన మూడవ రోజు లేదా ఏడవ రోజు పురుడు చేస్తుంటారు. పూర్వం తల్లికి పాపకు పసుపు, ఆవుపేడతో ఒళ్లు రుద్ది స్నానం చేయించేవారు. ఈ రోజుల్లో కూడా సబ్బులకు బదులు పశువుల పేడను ఉపయోగించడం కన్పిస్తుంది. ఆరోగ్యరీత్యా పరిశీలిస్తే పేడలో అమ్మోనియా, పసుపులో క్రిమిసంహారక శక్తి ఉందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది.

పురిటిరోజే జలమాత పూజ చేస్తారు. దీనిని లంబాడీలు దళయాదోకావేరో అంటారు. ఇంటికి తూర్పు దిక్కున తీసిన గుంతలో నీటిని నింపుతారు. ఈ పూజా కార్యక్రమం తెలంగాణా స్త్రీలు 21వ రోజు సంతానం లేని స్త్రీలను బావి దగ్గరకు తీసుకొనిపోయి వీపుపై నీళ్లు కుమ్మరించే ఆచారంతోపోలి వుంటుంది. మూడు ఇత్తడి చెంబులను మరికొన్ని ప్రాంతాల్లో ఒకే చెంబును సున్నం, బొగ్గు, పసుపు బొట్లతో అలంకరిస్తారు. మొదటి చెంబులో పసుపు నీళ్లు నింపుతారు. దరిచేవని విశ్వసిస్తారు. అలంకరించిన చెంబులను ఐదేండ్లు దాటని ముగ్గురు బాలురతో ఇద్దరు బాలికలతో బాలింత తలపైన పెట్టిస్తారు. సౌభాగ్యవతులు బియ్యాన్ని లేదా మొక్కజొన్ననలను అక్షింతలు చల్లుతూ, చ్వారికి, చోరా, చ్వారికి, చోరా అని పాడుతూ చెంబులను గుంత దగ్గర నింపుతారు. సన్‌ సుతిలిసువోలేన్‌ వర్‌ ఆయేస్‌ అంటూ పాటలను పాడుతారు. ఆడపిల్లలకైతే సూధి దారం తీసుకొనివెళ్లు, మగపిల్లాడికైతే జనుం, సుత్తి, డబ్బనం తీసుకొని వచ్చేయి. అని ఈ పాట అర్థం (జనపనారతో చేసిన సన్నటి తాడును సుతిలి అని, గోనో సంచిని కుట్టే సూధిని డబ్బనం అని అంటారు) ఈ పాటలో లంబాడీల జీవిత విధానం ప్రతిబింబిస్తుంది.

లంబాడీ స్త్రీలు కనువిందును కలిగించే కళాత్మకమైన దుస్తులను కుట్టడంలో నేర్పరులు. కాంచలి (రవిక) గాగ్రా (పరికిణి) కుట్టడం నేర్చుకున్న తరువాతనే ఆడపిల్లలకు పెళ్ళి చేస్తారు. ఆకంచలి అంటే అద్దాలతో కుట్టిన రవిక, గాగ్రా అంటే పరికిణి, అందుకేఆడల్లిలకు ఉపకరించే కుట్టు పరికరాలను కానుకలుగా సమర్పించడం.పుట్టిన బిడ్డలకు మొదటిసారి తలవెంట్రుకలను తీయడాన్ని లంబాడీ భాషలో లట్టాకాడేర్‌ అని అంటారు. లంబాడీల్లో ఒక్కరికే కాకుండా జంటగా పుట్టు వెండ్రుకలు తీయడం ఆచారం, ఒక్కరికే తీయవలసి వచ్చినపుడు పక్కన ఓక్రాను పెడతారు. ఓక్రా అంటే చిన్న గోనె సంచిలో మెత్తని గడ్డి నింపి కుట్టిన దిండు లంబాడీలు సామాన్యంగా తుల్జాభవాని దేవత ఎదుట వెంట్రుకలను తీస్తుంటారు. ఒకవేళ బాలాజీ భగవానునికి గానీ, వేముల వాడ రాజన్నదేవునికి గానీ మొక్కుకున్నట్ల యితే రెండు పిలకలుంచుతారు. లంబాడీల్లో ఋతుమతి అయిన అమ్మాయిలకు ప్రత్యేక ఉత్సావాలు చేయరు. అయితే ఈ రోజుల్లో కొంతమంది లంబాడీలు తెలుగువారి సంస్కృతి ప్రభావంతో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.


Next Story

Most Viewed