‘కిషన్ రెడ్డి ర్యాలీలో టీఆర్ఎస్ నేతల అరాచకం’.. సహించేది లేదన్న బండి సంజయ్

by  |
‘కిషన్ రెడ్డి ర్యాలీలో టీఆర్ఎస్ నేతల అరాచకం’.. సహించేది లేదన్న బండి సంజయ్
X

దిశ, హుజూరాబాద్: ఉప ఎన్నికను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామని కేసీఆర్‌కు స్పష్టమైందని, ఓటమి భయంతోనే భౌతిక దాడులకు దిగుతున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాచ్‌లను హుజూరాబాద్ నియోజకవర్గంలో దింపారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్‌లో బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారని, బీజేపీ నేతలపై దాడులకు దిగారన్నారు. కేంద్రమంత్రి టూర్‌లో టీఆర్ఎస్ నేతలు దాడిలో పోలీసులే ప్రత్యక్ష సాక్షులు అని సంజయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసేందుకే కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, దీనిని ఈసీ సీరియస్‌గా పరిగణించాలని కోరారు.

టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని బండి సంజయ్ హెచ్చరించారు. కొట్లాటకు దిగుతామంటే తాము కూడా సిద్ధంగా ఉంటామన్నారు. పోలీసులపై కూడా టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం హేయనీయమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. ఈ దాడి ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

ప్రజల కోసం ఒకనాడు ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వ్యవస్థ నేడు అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం దారుణమని, ఈ దాడులకు కారకులెవరు? దాడులు చేసిందెవరనే అంశాలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయాలని కోరుతున్నామని, కేంద్ర కేబినెట్ మినిస్టర్ వస్తే కనీస భద్రత ఇవ్వకపోవడం పోలీసుల వైఫల్యమేనని విమర్శించారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని.. ఈ సమయంలో ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలే తప్పా.. భౌతిక దాడులకు పాల్పడితే సహించబోమని బండి సంజయ్ హెచ్చరించారు.


Next Story