కేసీఆర్ తాలిబన్ సీఎం.. బండి సంజయ్ ఫైర్

by  |
కేసీఆర్ తాలిబన్ సీఎం.. బండి సంజయ్ ఫైర్
X

దిశ, హుజురాబాద్​ : తెలంగాణలో సీఎం కేసీఆర్ తాలిబన్​తరహా పాలన చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలు రూ.20 వేలు కవర్లో పెట్టి పంచిపెడుతూ ఓట్లు కొనుక్కుంటుంటే, బీజేపీ మాత్రం కార్యకర్తలను నమ్ముకుందన్నారు. కేసీఆర్ తాలిబన్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉరి కావాలనుకుంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, వరి కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని సంజయ్ కోరారు.

రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఖమ్మం, సిద్దిపేట కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరి వద్దు అనడానికి కేసీఆర్ ఎవరు.? కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ఎందుకు కొనదో.. కారణం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. వరి వద్దు అని చెబుతున్న అధికారుల మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. రైతుల కోసం తెగించి కొట్లాడటంతో పాటు జైలుకి వెల్లడానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.

వరి వేస్తే ఉరే అంటున్న టీఆర్ఎస్ పార్టీకి చెంప చెళ్లుమనిపించేలా హుజురాబాద్ తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఏ తాలిబన్ అయినా వస్తాడని.. పర్మిషన్ లేకున్నా తెలంగాణకు వచ్చే స్వేచ్చ నెలకొందని ఆరోపించారు.

రామరాజ్యం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. దళిత బంధు ఆపాలని ఈటల రాజేందర్ లేఖలు రాసినట్టు తప్పుడు లెటర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు కింద ఎందుకు డబ్బులు ఇవ్వలేదో వివరించాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని, రూ. 41 రాష్ట్ర పన్ను తగ్గిస్తే రూ. 60 లకు పెట్రోల్ ధర తగ్గుతుందని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచి తీరుతుందని సంజయ్ ప్రకటించారు. అధికారులు ఎన్నికల్లో నిబద్దతతో, నిజాయితీతో విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సంజయ్ వేడుకొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed