కనుమరుగవుతోన్న బండ చెరువు..!

39

దిశ, తెలంగాణ బ్యూరో : మల్కాజిగిరిలో బండ చెరువు కుచించుకు పోయింది. సుమారు 284.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చివరకు 50 ఎకరాలు మాత్రమే మిగిలింది. లారీల కొద్దీ మట్టితో పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టారు. చెరువు చుట్టూ హద్దుగా బండ్ ఉన్నా దాని ఆనవాళ్ళే లేకుండా కొత్త హద్దును సృష్టించారు.

చట్టాలు, నిబంధనలు తూచ్..

‘వాటర్ యాక్ట్’, ‘వాల్టా యాక్ట్’ ప్రకారం చెరువు ఉన్న ప్రాంతంలో (ఎఫ్‌టీఎల్-ఫుల్ టాంక్ లెవల్)నూ, బఫర్ జోన్‌లోనూ ఎలాంటి శాశ్వత, కాంక్రీటు నిర్మాణాలు జరగకూడదు. భూ విక్రయాలు జరగకూడదు. రిజిస్ట్రేషన్లు జరగకూడదు. కానీ రాజకీయ నాయకులు, రియల్టర్లు, దళారీలు మిలాఖత్ అయి చెరువు భూములను ఖతం పెట్టారు. ఇందులో వక్ఫ్, ప్రభుత్వ భూములూ ఉన్నాయి. అయినా రాజకీయ పలుకుబడి ఉన్న వీరికి లెక్కేలేదు. చిన్నపాటి లేఔట్లు, అందులో ప్లాట్లు వేశారు. అమ్మకాలూ జోరుగానే జరిగాయి. కొనుగోలు చేసినవారు రిజిస్ట్రేషన్లు కూడా చేయించేసుకున్నారు. వెంటనే బహుళ అంతస్తుల నిర్మాణాలను కూడా పూర్తిచేశారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలైనా ఇటు రెవెన్యూ అధికారులు, అటు మునిసిపల్ అధికారులు పట్టించుకోలేదు. పనులు వేగంగా చేయించడం కోసం బ్రోకర్లు కూడా పుట్టుకొచ్చారు. గతంలో ఒకటి రెండు సార్లు రెవెన్యూ అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, ఆ తర్వాత మళ్ళీ భవనాలు వెలిశాయి. ఈ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో సుమారు 400 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అంచనా.

పట్టా, వక్ఫ్ భూములూ ఆక్రమించారు..

మల్కాజిగిరిలోని బండ చెరువు మొత్తం విస్తీర్ణం గతంలో 284 ఎకరాలు. కబ్జాల తర్వాత ఇప్పుడు మిగిలింది దాదాపు 53 ఎకరాలు మాత్రమే. ప్రస్తుతం 53 ఎకరాల్లో నీరు ఉన్నట్లు సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా చేసిన అంచనాలో తేలింది. గతంలో చెరువుకు ఉన్న మ్యాప్‌ను ప్రామాణికంగా తీసుకుని తాజా పరిస్థితిని పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 142 ఎకరాల మేర అక్రమ కట్టడాలు రావడంతో నీరు లేకుండా పోయిందని గుర్తించారు. ఇలా ఆక్రమణకు గురైన స్థలంలో పట్టా భూమి 52 ఎకరాలు, వక్ఫ్ బోర్డు భూములు 89 ఎకరాలు ఉన్నట్టు అధికారుల దగ్గర ఉన్న రికార్డుల ద్వారా స్పష్టమైంది. చెరువు చుట్టూ 10 కాలనీలు వెలిశాయి. ఇందులో వ్యక్తిగత ఇండ్లతో పాటు బహుళ అంతస్థుల అపార్టుమెంటు భవనాలు కూడా ఉన్నాయి. వక్ఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధన ఉన్నా యథేచ్ఛగా ఇతరుల పేర్ల మీదకు బదిలీ అయిపోయాయి. చెరువులోకి వచ్చే నాలాలు, తూములు, అలుగు ప్రాంతాల్లోనూ నిర్మాణాలు జరిగాయి.

ట్రీట్‌మెంట్ ప్లాంటు ఏర్పాటులో నిర్లక్ష్యం

పరిసర కాలనీల మురుగంతా చెరువులోకే చేరుతోంది. మురుగును శుద్ధి చేసే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ను ప్రభుత్వం నెలకొల్పాలి. కానీ ఇవేవీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. చెరువంతా గుర్రపు డెక్కతో పేరుకుపోయింది. భూగర్భ జలం కూడా కలుషితమవుతోంది. ఫలితంగా స్థానిక కాలనీల్లో బోర్ల ద్వారా వచ్చే నీరు శుభ్రంగా ఉండడంలేదు. బండచెరువు ఆక్రమణలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం సుందరీకరణ కోసం మాత్రం ప్రత్యేకంగా రూ.80 లక్షలు ఖర్చు చేసింది.