దీపావళి కానుకగా సరికొత్త ‘పల్సర్ 250’ బైక్ రిలీజ్

90
Bajaj Pulsar N250

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఈ ఏడాది దీపావళి సందర్భంగా తన కొత్త ‘పల్సర్ 250సీసీ’ బైకును విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో పల్సర్ మోడల్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరింతమంది కొత్త వినియోగదారులను సంపాదించుకునేందుకు ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. అంతేకాకుండా, పల్సర్ మోడల్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంతో పాటు ఈ ఏడాది దీపావళి కానుకగా హై-ఎండ్ వెర్షన్ పల్సర్‌ను ఎన్250, ఎఫ్250 వేరియంట్లలో తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది.

ఇందులో ఎన్250 వేరియంట్ ధర రూ. 1.38 లక్షలు, ఎఫ్250 రూ. 1.40 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఎన్250 సింగిల్ టెక్నో గ్రే కలర్‌లోనూ, ఎఫ్250 రేసింగ్ రెడ్, టెక్నో గ్రే రెండు కలర్లలో లభిస్తుంది. ఈ సరికొత్త బైక్ ఇప్పటివరకు పల్సర్ మోడల్‌లోనే అతిపెద్ద ఇంజిన్ కెపాసిటీతో వస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త బజాజ్ పల్సర్ 250 ఇప్పటికే మార్కెట్లో ఉన్న యమహా ఎఫ్‌జెడ్ 25, సుజుకి జిక్సర్ 250, తన సొంత బజాజ్ డొమినార్ 250కి పోటీగా ఉండనుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైక్ డిజైన్, సిటింగ్ హైట్, ట్విన్ డిస్క్ బ్రేక్, టెలిస్కోప్ ఫ్రంట్ ఫోర్క్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో అందించినట్టు కంపెనీ వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..