రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అయోధ్యకు ఉచిత రైలు పథకం

by Malleboina Mahesh |   (  Updated:2024-01-11 07:55:53  IST  )

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అయోధ్యకు ఉచిత రైలు పథకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే రామభక్తులకు ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని తీసుకొస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు పర్యవేక్షించ నుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తామని అధికారిక ప్రకటన తెలిపింది.

అయోధ్య ఉచిత రైలు ప్రయాణం.. అర్హత

వార్షిక తీర్థయాత్రలో సుమారు 20,000 మందిని రైలులో అయోధ్యకు తీసుకువెళతారని అధికారిక ప్రకటన పేర్కొంది. 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయస్సు గల ఛత్తీస్‌గఢ్ స్థానికులు, వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నవారు ఈ పథకం కింద అర్హులు. మొదటి విడతలో 55 ఏళ్లు పైబడిన వారి ఎంపిక జరుగుతుంది.

ఉచిత రైలు ప్రయాణం..బోర్డింగ్ స్టేషన్లు, హాల్ట్‌లు

రాయ్‌పూర్, దుర్గ్, రాయ్‌ఘర్, అంబికాపూర్ స్టేషన్‌ల నుండి ప్రజలు ప్రత్యేక రైలులో ఎక్కవచ్చు. 900 కిలోమీటర్ల పర్యటనలో ప్రధాన గమ్యస్థానం అయోధ్య కు చేరుకుంటుంది. పర్యటన సమయంలో, యాత్రికులు వారణాసిలో రాత్రి బస చేస్తారు. అక్కడ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి గంగా హారతిలో పాల్గొంటారు. ఈ పథకాన్ని సులభంగా అమలు చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ఈ పథకం కింద వారానికో ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేస్తారు.

Next Story