వీధిలో డ్యాన్స్ చేసి.. వెండితెరపై చాన్స్ పట్టేశాడు..

by  |
వీధిలో డ్యాన్స్ చేసి.. వెండితెరపై చాన్స్ పట్టేశాడు..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకొని సెలబ్రిటీ స్టేటస్ పొందాలంటే.. ఒకప్పటిలా ఆఫర్స్ కోసం ప్రొడక్షన్ హౌస్‌లు, డైరెక్టర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరగేలా తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీ స్కిల్స్‌ను ప్రదర్శించే ఏదైనా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఈజీగా గుర్తింపు పొందవచ్చు. ఇక కంటెంట్‌లో దమ్ము, వీడియోలో యూనిక్‌ స్టైల్ ఉంటే, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర నుంచే సెలబ్రిటీలా మారొచ్చని చెప్పేందుకు మహారాష్ట్ర ఆటో డ్రైవర్ డ్యాన్స్ వీడియోనే నిదర్శనం.

మహారాష్ట్ర, పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన ఆటో‌డ్రైవర్ బాబాజి కాంబ్లేకు డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్సర్‌గా, హీరోగా రాణించాలని కలలు కన్నాడు కానీ, సరైన అవకాశాలు లభించలేదు. ఈ క్రమంలో తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను అప్పుడప్పుడూ రోడ్డుపైనే ప్రదర్శిస్తుంటాడు. కాగా ఇటీవలే తన తోటి ఆటోడ్రైవర్ల ఎదుట ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు. ఆ పాటకు అచ్చం సినిమా హీరోలా చేసిన ఆయన డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు నెట్టింట షేర్ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడం విశేషం. కాగా ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణు‌పంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక సినిమాలో ఆఫర్ లభించడం పట్ల ఆటో డ్రైవర్ కాంబ్లే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Next Story

Most Viewed