రెండేళ్లుగా నరకమే.. ఆ రహదారులను పట్టించుకోని అధికారులు

by  |
రెండేళ్లుగా నరకమే.. ఆ రహదారులను పట్టించుకోని అధికారులు
X

దిశ, మరిపెడ: పేరుకే ఎన్ హెచ్ 563.. దారంతా గుంతల మయం.. గుంతలంటే మాములుగా కాదండి మోకాళ్ళ లోతుకు తక్కువ కాకుండా ఉన్నాయి. దంతాలపల్లి నుంచి మొదలుకొని మరిపెడ వరకు ఇదే పరిస్థితి. మరిపెడ మండల కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. రోడ్డు కాస్త డొంక ను తలపిస్తోంది. ఈ దారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు వెళ్తుంటాయి. ఈ సారి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. మోకాళ్ల లోతు గుంతలతో వాహనదారులు ప్రాణాలకు గండంగా మారింది. నాసిరకంగా గుత్తేదారులు రోడ్డు వేయటంతో, ఒక్క వర్షానికే రోడ్డు తేలిపోతోంది. అంతే కాకుండా ప్రధానంగా కరీంనగర్ నుంచి మచిలీపట్నం పోర్టుకు పరిమితి కి మించిన లోడుతో వాహనాలు వెళ్తుడటంతో తరచూ రోడ్డు పాడవుతోందని రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక మరిపెడ మున్సిపల్ కేంద్రంలో వానొస్తే బావులు.. ఎండ కాస్తే దుబ్బ వెరసి స్థానిక వాసులకు ప్రమాదాలు.. శ్వాసకోశ వ్యాధులు తప్పడంలేదు. అదే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి లో భాగంగా డివైడర్ను పొదగించారు. కానీ రోడ్డు విస్తరణ చేయక పోవటం వల్ల దారి ఇరుకుగా మారింది.

ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు..

ఈ దారిని బాగు చేయాలని మానుకోట ఎంపీ మాలోతు కవిత కేంద్ర రోడ్ల శాఖ మాత్యులకు వినతి ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసినా సమస్య నేటి వరకు పరిష్కారం కాలేదు. అయితే ఇదే రహదారి గుండా వరంగల్, ఖమ్మం మంత్రులు, పెద్ద నాయకులు, కలెక్టర్లు వెళ్తుంటారు. అయినా 20కి.మీ ఎందుకు బాగుచేయటం లేదని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సారి కార్లు వెళ్లలేని విధంగా గుంతలు పడటంతో కలెక్టర్లు, మంత్రులు “వన్ వే” లో వెళ్తుంటారు. 20కి.మీ పరిధిలో రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు మరమ్మతులకు గురికావడం, లెక్కలేని సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ప్రమాదం బారిన పడి గాయాలు కావటమే కాకుండా చనిపోతున్నారు. నాలుగు నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుటుంబం మరిపెడ కార్గిల్ సెంటర్ లో గుంత వద్ద స్లో చేశారు. ఇంతలో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఎన్ని ప్రమాదాలు జరిగిన ఆర్ అండ్ బీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రహదారి బాగుచేయాలి..

ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరక ప్రాయంగా మారింది. ఎల్లంపేట వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. మరమ్మతులు చేయాలని ధర్నా చేసినా ఫలితం శూన్యం. ఇదే కాదు గ్రామాల లింకు రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి వెంటనే బాగు చేయాలి.
– గోపి కృష్ణ, బీజేపీ మరిపెడ మండల అధ్యక్షుడు


Next Story

Most Viewed