అధికారుల వివక్ష.. ఆంక్షల ‘చేనేత’

51

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నో పథకాలు రూపొందించారు. ఏటా రూ.100 కోట్లకు పైగానే బడ్జెట్ లో పెట్టి ఊరిస్తున్నారు. కార్మికులు తమ భవిష్యత్తుకు భరోసా లభించిందని ఆశపడుతుండగా, అధికారుల తీరుతో మాత్రం కేటాయించిన బడ్జెట్ కూడా సద్వినియోగం కాకుండా పోతున్నది. రాష్ట్రంలో చేనేత కార్మికుల పట్ల అధికారులు వివక్ష చూపిస్తున్నారు. ఏ ఇతర సంక్షేమ పథకానికి పెట్టని ఆంక్షలు తమకు పెట్టే సరికి చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

సాయానికి ఎవరికీ లేని స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పణ ఎందుకని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే అరకొర సాయానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంతో సిబ్బందిని కార్యాలయంలో వేసి తాళాలు వేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర సంక్షేమ పథకం అమలు చేసేందుకు నిబంధనలు కఠినతరం చేశారు. అధికారుల చుట్టూ ప్రతిసారి తిప్పుకునే విధంగా రూపొందించారు. అనర్హులకు అందకూడదన్న నెపంతో అర్హులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వానికి నిధులు మిగులుస్తున్నామంటూ ఏ పథకానికి లేని విధంగా దరఖాస్తుదారుడిని చేనేత, జౌళి శాఖ ఏడీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణం చేయించుకుంటున్నారు. ఓ సామాన్య చేనేత కార్మికుడికి యార్న్ సబ్సిడీ అందించేందుకు చేనేత, జౌళి శాఖ సంచాలకులు పెట్టిన నిబంధనలను చూస్తే ఔరా అనిపిస్తోంది. అందుకే మూడేండ్లల్లో ఏటా రూ.100 కోట్ల వరకు చేనేత మిత్ర పథకానికి వెచ్చించినా విడుదల చేసిన నిధులు 20 శాతం కూడా లేవని తెలుస్తోంది. దరఖాస్తులను పరిశీలించడం లేదెందుకని, సబ్సిడీ సొమ్ము ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే తమపై విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు పెట్టి వేధిస్తున్నారని యాదాద్రి జిల్లా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమానికి స్వీయ ధ్రువీకరణ

సబ్సిడీ సొమ్ము తీసుకునేటప్పుడు కార్మికుడు కఠిన నిబంధనలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాంటి హామీ పత్రాలను రూ.లక్షల్లో తీసుకునే లబ్ధిదారుల నుంచి కూడా తీసుకోవడం లేదు. కేవలం రాష్ట్రంలో చేనేత కార్మికులకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనను పెట్టారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కేటీఆర్ నుంచి మెప్పు పొందేందుకే కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్మును పొందేందుకు కఠినతరమైన ఆంక్షలను చేనేత, జౌళి సంచాలకులు రూపొందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలాలు ఈజీగా అందకుండా డైరెక్టర్ ను కొందరు రిటైర్డ్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిసింది. ఆమె కూడా కార్మికుల అభిప్రాయాలు వినకుండా నివేదికల ప్రకారమే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ప్రతిసారి దరఖాస్తు చేసుకోవడమెందుకు?:

ఏ రంగంలోనైనా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే సంక్షేమ ఫలాలు అందుతాయి. చేనేత కార్మికులు మాత్రం ప్రతిసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే. మగ్గం నేస్తున్నట్లుగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి జియో ట్యాగింగ్ నంబరు కేటాయించారు. దాని ప్రకారం ఫలాలను అందించొచ్చు. కానీ ప్రతిసారి సబ్సిడీ సొమ్ము అందుకునేందుకు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా దళారులు బాగు పడుతున్నారు. మాస్టర్ వీవర్ కు 5 శాతం వరకు కమీషన్ ఇస్తున్నారు. ఐతే చాలా మంది మాస్టర్ వీవర్ల దగ్గరే పని చేస్తున్నారు. సొంతంగా మగ్గాలు నేస్తున్న వారి సంఖ్య తక్కువ. ఈ క్రమంలో సిల్క్ యార్న్ కొనుగోలు బిల్లుల సమర్పణలో అక్రమాలు జరుగుతున్నాయి. అందుకే జియో ట్యాగింగ్ నంబరు కలిగిన కార్మికులకు చేనేత మిత్ర పథకం ఎలాంటి ఆంక్షలు లేకుండా వారి ఖాతాల్లో జమ చేయడం ద్వారా అవినీతికి బ్రేకులు పడుతాయి. దానికి బదులుగా ప్రతి సారి 40 శాతం నూలు సబ్సిడీ పథకంలో రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనను తొలగించాలి. –యర్రమాద వెంకన్ననేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

ఎన్ని రూ.కోట్లు ఇచ్చారు..?

చేనేత మిత్ర పథకం బాగుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు బాగుంది. యార్న్ సబ్సిడీ కింద కార్మికులకు ఇచ్చిందెంత? గతేడాది జనవరిలో పెట్టిన దరఖాస్తులకు ఇప్పుడు నిధులు వచ్చాయి. ఇంకా మే నెలలో పెట్టుకున్న దరఖాస్తులకు మోక్షం లేదు. ఎన్ని నెలలు పడుతుందో మంత్రి కేటీఆర్ సమీక్షించాలి. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే ఏ పథకానికైనా అర్హులవుతారు. కానీ చేనేత మిత్రలో మాత్రం ప్రతి సారి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు మగ్గం నేస్తున్నారా? లేదా? అంటూ పరిశీలించి జియో ట్యాగింగ్ నంబర్లు ఇచ్చారు. దాని ఆధారంగా ఖాతాల్లో జమ చేయొచ్చు. కానీ ప్రతిసారి బిల్లులు సమర్పించడం, దరఖాస్తు చేసుకోవడం, ఏమైందని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటున్నారు. ఇలా అనేక ఇబ్బందులకు గురి చేసి సబ్సిడీ సొమ్ము ఇవ్వడంతో ప్రభుత్వం మీద అభిమానం పోతోంది. – చింతకింద రమేష్, భూదాన్ పోచంపల్లి

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..