మరో కొత్త మోడల్‌ కారును విడుదల చేసిన ఆడి ఇండియా!

by  |
audi
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో తన కొత్త ఆడి క్యూ5 కారును విడుదల చేసింది. రెండు సంవత్సరాల క్రితం బీఎస్6 నిబంధనల కారణంగా దేశీయ మార్కెట్లలో లాంచ్ చేయని ఈ మోడల్ కారును కొత్త రూపంలో ఆడి సంస్థ ప్రవేశపెట్టింది. ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ఎస్‌యూవీ రూ. 58.93 లక్షలుగా, ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 63.77 లక్షల ధరలో ఈ రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఇప్పటికే 100కు పైగా కార్ల కోసం వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారని, త్వరలో డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

‘ప్రస్తుత ఏడాదిలో కంపెనీ నుంచి వస్తున్న తొమ్మిదో మోడల్ కారు ఇది. సరికొత్తగా తీసుకొచ్చిన ఈ కారు ‘బెస్ట్ సెల్లర్’గా నిలుస్తుంది. ఈ ఏడాది ఆడి ఇండియాకు బాగా కలిసొచ్చింది. మొదటి 10 నెలల్లో అమ్మకాలు 100 శాతానికి పైగా పెరిగాయని, రానున్న రోజుల్లో ఈ వృద్ధి మరింత పెరుగుతుందనే నమ్మకం ఉందని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రీమియం వాహనాలు బీఎండబ్ల్యూ ఎక్స్3, వోల్వో ఎక్స్ సీ60, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ మోడళ్లకు ఈ కొత్త ఆడి క్యూ5 పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

క్యూ5 మోడల్ కారు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కేవలం 6.3 సెకన్లలో 0-100 కిలోమీటలర్ వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా రీ-డిజైన్ చేసిన బంపర్‌తో పాటు సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, ఎల్ఈడీ లైట్స్ వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.


Next Story