కౌన్సిలర్ దౌర్జన్యం.. హరితహారం పేరుతో పార్క్ స్థలం కబ్జాకు యత్నం

by  |
కౌన్సిలర్ దౌర్జన్యం..  హరితహారం పేరుతో పార్క్ స్థలం కబ్జాకు యత్నం
X

దిశ, జవహర్ నగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకాన్ని సైతం ధిక్కరిస్తూ ఓ కౌన్సిలర్ ఏకంగా పార్కునే కబ్జా చేయాలని డిసైడ్ అయ్యారు. దమ్మాయి గూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ భవానీ నగర్ కాలనీ(సర్వే నంబర్ 22, ప్లాట్ నం.39)లో 170 గజాల స్థలాన్ని పార్క్ కోసం అప్పట్లో కేటాయించారు. దీంతో పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు, అధికార పార్టీ పాలకులు ఈ స్థలంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. గతంలో ఏర్పాటు చేసిన లే అవుట్ ప్రకారం సర్వే నంబర్ 22 లో సుమారు 40 ప్లాట్లుగా విభజిస్తూ, 39ప్లాట్ లో ఉన్న సుమారు 170 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు.దీన్ని కొందరు నాయకులు కుట్ర పన్ని ఓ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పార్కు స్థలాన్ని కబ్జాలకు పాల్పడడం కోసం పలు రకాల లే అవుట్లను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో కొన్న వారి దగ్గర ఉన్న లే అవుట్లలో దాదాపు అందరి డాక్యుమెంట్లలో 39వ ప్లాట్ పార్క్ స్థలంగా ఉండగా..ఈ మధ్య అధికార పార్టీ నేతలు సామాజిక కులం పేరుతో స్థానికులను బెదిరిస్తూ పార్క్ స్థలాన్ని లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

హరితహారం కార్యక్రమం అనంతరం మొక్కల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన ఓ కౌన్సిలర్ ఏకంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తూ కాలనీ వాసులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు వాపోయారు. అధికార పార్టీలో ఉండి కాలనీ పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఏకంగా నాటిన మొక్కలను తొలగించి చదును చేయడంపై స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయానా కౌన్సిలర్ స్థాయి మరిచి ఇష్టానుసారంగా పార్క్ విషయంలో జోక్యం చేసుకోవడం తగదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, పార్క్ స్థలాల పరిరక్షణకు అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed