వసూళ్లలో రికార్డ్ సృష్టించిన జీఎస్టీ…

by  |
gst
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో మరోసారి జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లను అధిగమించాయి. మొత్తం రూ. 1,31,526 కోట్లతో 2017లో జీఎస్టీ విధానం అమలైన తర్వాత రెండో అత్యధిక ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ ఆదాయం దాదాపు రూ. 1.40 లక్షల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,31,526 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ) రూ. 23,978 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 66,815 కోట్లు వచ్చాయి. ఇది వస్తు దిగుమతులపై వసూలైన రూ. 32,165 కోట్లతో కలిపి). సెస్ రూపంలో రూ. 9,606 కోట్లు(వస్తు దిగుమతులపై రూ. 653 కోట్లతో కలిపి) వసూలయ్యాయని మంత్రిత్వ శాఖ వివరించింది. నవంబర్ నెల జీఎస్టీ రాబడి గతేడాది ఇదే నెలలో నమోదైన దానికంటే 25 శాతం ఎక్కువ కాగా, కోవిడ్-19 ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే నెలతో పోలిస్తే 27 శాతం అధికం కావడం విశేషం. ఇక ఈ ఏడాది అక్టోబర్ నెలలో వచ్చిన రూ. 1.30 లక్షల కోట్లతో పోలిస్తే 1.1 శాతం ఎక్కువ.

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు ఇలా..

నవంబర్ జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రూ. 3,931 కోట్లతో 24 శాతం వృద్ధిని సాధించింది. ఇది అంతకుముందు అక్టోబర్ కంటే 16 శాతం పెరగడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రూ. 2,750 కోట్లతో 10 శాతం అధిక జీఎస్టీ వసూళ్లు సాధించింది. గతేడాది ఇదే నెలలో 2,507 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కంటే స్వల్పంగా 1 శాతం పెరిగాయి.


Next Story

Most Viewed