వారితో బతుకమ్మ చీరలు ప్రత్యేకంగా చేయించాం : పోచారం శ్రీనివాస్ రెడ్డి

by  |
Pocharam Srinivas Reddy
X

దిశ, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీలో పోచారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా మహిళలకు చీరలను పంపిణీ చేయడం లేదన్నారు. రూ.350 నుంచి 400 కోట్ల నిధులు వెచ్చించి నేతన్నలచేత ప్రత్యేకంగా చీరలు తయారు చేయించామని అన్నారు.

అంతేగాకుండా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్‌లో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయలేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లో పింఛన్ కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనాతో దేశంలో సర్వం ఆగిపోయినా.. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ అని వెల్లడించారు. ఈ పండుగతో నేతన్నలకు చేతినిండా పని దొరికిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, ఎంపీపీ రాధ బలరాం, జెడ్పీటీసీ శంకర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, మహిళలు పాల్గొన్నారు.



Next Story