అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతానని అనుకోలే : సీఎం

by  |
Assembly sessions adjourned
X

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీలో ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడతానని అనుకోలేదని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య ఆత్మీయ‌త‌ను ఎప్పటికీ మ‌రువ‌లేనన్నారు. ఆయ‌న ప్రజ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని సీఎం అన్నారు. మంగళవారం రెండవ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జ‌గ‌దీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంక‌ట వీర‌య్య, చిరుమర్తి లింగ‌య్య, బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్‌, ర‌వీంద్ర నాయ‌క్‌, జైపాల్ యాద‌వ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీర‌య్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫ‌ర్ హుస్సేన్ బ‌ల‌ప‌రిచారు. నోముల న‌ర్సింహ‌య్య మృతి ప‌ట్ల స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని స‌భ్యులంద‌రూ బ‌ల‌ప‌రిచి నోముల న‌ర్సింహ‌య్య మృతికి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. నోముల సేవలు, పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. నోముల న‌ర్సింహ‌య్య తనకు వ్యక్తిగ‌తంగాద‌గ్గరి మిత్రులని పేర్కొన్నారు. ఆయ‌న‌తో క‌లిసి చాలా సంవ‌త్సరాలు ప‌ని చేశామని, తెలంగాణ ఉద్యమంలోనూ కీల‌క‌పాత్ర పోషించారని కొనియాడారు. న‌ర్సింహ‌య్య గురువు రాఘ‌వ‌రెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న సీఎం కేసీఆర్‌.. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని చూసి న‌ర్సింహ‌య్య బాధ‌ప‌డేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు లేని నర్సింహయ్య హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌న్నారు.

సంతాప తీర్మానంలో తెలంగాణలో ఇటీవ‌లి కాలంలో మ‌ర‌ణించిన ఎమ్మెల్యేల‌కు శాస‌న‌స‌భ నివాళుల‌ర్పించింది. నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య, బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేష్, ముషీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే నాయిని న‌ర్సింహారెడ్డి, ప‌రిగి మాజీ ఎమ్మెల్యే క‌మ‌తం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు, మ‌ధిర మాజీ ఎమ్మెల్యే క‌ట్టా వెంక‌ట న‌ర్సయ్య, చెన్నూరు మాజీ స‌భ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జ‌హీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల్ బాగ‌న్న, అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వీరంద‌రి ఆత్మల‌కు శాంతి చేకూరాల‌ని స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభ వాయిదా ప‌డింది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పనున్నారు.18న బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్నారు.


Next Story

Most Viewed