బిపిన్ రావత్‌కు లీఫ్ ఆర్ట్‌తో నివాళి..

by  |
బిపిన్ రావత్‌కు లీఫ్ ఆర్ట్‌తో నివాళి..
X

దిశ, ఫీచర్స్ : తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా మరో 11 మంది సాయుధ బలగాలు మృతి చెందడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. సామాన్య ప్రజానీకం నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఆయా కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేయడంతో పాటు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే ఓ కళాకారుడు ఆకును జనరల్ రావత్‌ వదనంగా మలిచి తనదైన శైలిలో నివాళులివ్వగా.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఐపీఎస్ అధికారి హెచ్‌జీఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ తమ సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.

కర్నాటకలోని మంగళూరుకు చెందిన శశి అద్కర్ అనే ఆర్టిస్ట్ ఆకునే కాన్వాస్‌గా మార్చుకుని, దానిపై వివిధ చిత్రాలు కార్వింగ్ చేస్తుంటాడు. జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక, ఇతర సైనికుల మరణం పట్ల ఎంతో వేదన చెందిన శశి.. తన కళ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆకుపై రావత్ ముఖాన్ని చెక్కాడు. కాగా ఈ కళాకారుడు దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు, శివునితో కూడిన పత్ర కళాకృతులను రూపొందించాడు. వైకల్యంతో బాధపడుతున్న శశి.. తన సృజనాత్మక కళతో ప్రశంసలు పొందుతున్నాడు.

‘నా టాలెంట్ ను ప్రజలు గుర్తించడం సంతోషకరం. అనుపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, అశ్విని వైష్ణవ్ వంటి చాలా మంది ప్రముఖ వ్యక్తులు, mygovIndia వంటి కొన్ని పేజీలు బిపిన్ రావత్‌కు నివాళి తెలియజేస్తూ చేసిన లీఫ్ ఆర్ట్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను’ అని శశి తెలిపాడు.
Next Story

Most Viewed