టీఎస్​పీఎస్సీ పాలకవర్గం కోసం పక్కా స్కెచ్ .. వారి కోసం ఆరా?

by  |
TSPSC
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పాలకవర్గానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే ఒక్కడితో ఉన్న టీఎస్​పీఎస్సీకి ఈ నెలలోనే చైర్మన్​తో పాటు నలుగురు సభ్యులను నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఉమ్మడి జిల్లాల వారీగా 50 వేల పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ముందుగా టీఎస్​పీఎస్సీకి పాలకవర్గాన్ని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీపీఎస్​సీ సమయంలోనే చాలా మందికి అనర్హులకు అవకాశం ఇచ్చారనే అపవాదు ఇంకా వెంటాడుతోంది. ఈసారి అలా కాకుండా అర్హతలను కూడా ప్రమాణికంగా తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

పార్టీకా… రిటైర్డ్​ అధికారికా..?

టీఎస్​పీఎస్సీ చైర్మన్‌ ఎంపికపై ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్టు టాక్​. అర్హుడైన పార్టీలో పనిచేస్తున్న వారిని నియామించాలా..? లేక వేరే రిటైర్డ్‌ అధికారిని నియమించాలా..? అన్నది తేల్చుకోలేకపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ చైర్మన్ పదవికి ఉన్న పరిమితులు, వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినా… చాలా కీలక విభాగాల్లో ఐపీఎస్​ అధికారులను నియమిస్తున్నారనే విమర్శలున్నాయి.

గత కమిటీపై నిరుద్యోగుల విమర్శలు

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్​సీ సభ్యుల నియామకంలో తెలంగాణకు అన్యాయం చేయడమే కాకుండా అనర్హులకు నియమించారని విమర్శలున్నాయి. వైఎస్​ రాజశేఖరరెడ్డి హయాంలో గాంధీభవన్‌లో టెలీ ఆపరేటర్, కడపకు చెందిన ఎల్ఐసీ ఉద్యోగికి… ఇలా సభ్యులుగా నియమించి కనీస నియమాలు పాటించకుండా నియమించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్​పీఎస్సీకి ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి ఛైర్మన్​గా, ఉద్యోగ సంఘాల నేత విఠల్​తో పాటు చంద్రావతి, మతీనుద్దీన్​ ఖాద్రీ, వివేక్, కృష్ణారెడ్డి, రామ్మోహన్​రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్​రావు, సాయిలు, మన్మధరెడ్డిలను సభ్యులుగా నియమించారు.కాగా వారందరి పదవీకాలం ముగిసింది. సాయిలు ఒక్కడే సభ్యుడుగా ఉండటంతో ఆయనే యాక్టింగ్​ ఛైర్మన్​గా, సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. గత పాలకవర్గం హయాంలో ఉద్యోగాల భర్తీ ఆశించిన మేరకు చేయలేదని ఇప్పటికే నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఈసారి పర్​ఫెక్ట్​గా..?

కాగా ప్రస్తుతం టీఎస్​పీఎస్సీకి కొత్త పాలకవర్గాన్ని నియమించేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి సీఎం నుంచి హామీ వచ్చినట్లు సమాచారం. ఛైర్మన్​ అంశాన్ని మినహాయిస్తే… సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి కారం రవీందర్​రెడ్డి, డాక్టర్​ గండూరి వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఎస్​పీఎస్సీలో అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేస్తున్న గండూరి వెంకటేశ్వర్లు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన.. టీఎస్​పీఎస్సీలో అధికారి హోదాలో 26 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరికి అవకాశం వస్తుందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరితో పాటుగా సీఎంఓలో పనిచేసే ఓ అధికారి తన బంధువుకు, సీఎస్​కు సన్నిహితుడైన వాణిజ్య పన్నుల శాఖ మాజీ అధికారి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఎస్​పీఎస్సీలో ఈసారి పర్​ఫెక్ట్​ కమిటీ ఉండాలని మంత్రి కేటీఆర్​ప్లాన్​ వేస్తున్నారని టాక్​. దీంతో అర్హతలున్న వారికే అవకాశం ఉంటుందంటూ ప్రచారం. ​


Next Story