బెడ్స్ సమాచారం కోసం ‘ఢిల్లీ కరోనా యాప్’

by  |
బెడ్స్ సమాచారం కోసం ‘ఢిల్లీ కరోనా యాప్’
X

కరోనా తాకిడికి దేశరాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. అయితే ఏ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ అయ్యాయో తెలియజేసేందుకు వీలుగా ఢిల్లీ ప్రభుత్వం ఒక యాప్ విడుదల చేసింది. ‘ఢిల్లీ కరోనా’ అని పిలిచే ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బెడ్స్ వివరాలు రియల్‌టైమ్‌లో తెలుసుకోవచ్చు. సమాచార లోపం కారణంగా ఇబ్బందులు పడుతున్న కొవిడ్ 19 పేషెంట్లకు ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేవలం బెడ్స్ వివరాలు మాత్రమే కాకుండా ఐసీయూ, వెంటిలేటర్లు, ఇతర అవసరమైన ఆస్పత్రి సామగ్రి సమాచారం కూడా ఇందులో ఉంటుంది.

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా తాము ఈ అవసరాలను సమకూర్చినట్లు కేజ్రీవాల్ ఆన్‌లైన్ మీటింగ్‌లో చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 6,731 బెడ్స్ ఉండగా, వాటిలో 4,100 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. అయితే సమాచారం లోపం వల్ల బెడ్‌లు ఖాళీగా లేని ఆస్పత్రుల వద్ద ఎక్కువ పేషెంట్లు ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. యాప్‌లో బెడ్ ఖాళీగా ఉందని చూపించి, అక్కడి సిబ్బంది మాత్రం బెడ్ ఖాళీగా లేదని చెప్పి సహకరించకపోతే వెంటనే 1031 ప్రభుత్వ నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే ఇంట్లో ఉండి క్వారంటైన్ చికిత్స పాటిస్తే చాలని డాక్టర్లు చెబితే.. వెంటనే బెడ్ ఖాళీ చేసి ఇంటికెళ్లినట్టయితే నిజంగా బెడ్ అవసరమున్న వ్యక్తికి సాయపడిన వారవుతారని కేజ్రీవాల్ సలహా ఇచ్చారు.


Next Story

Most Viewed