తాత్కాలిక ఉద్యోగులకు భారీ షాక్.. ఆ సౌకర్యాలు ఇక బంద్

by  |
govt
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించే ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ తదితర విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు అక్టోబర్ నెల వరకు మాత్రమే వసతి కల్పిస్తామని తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా వీరంతా పని చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమంది అమరావతికి బదిలీ అయ్యారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలు చేరి సగం ప్రాతిపదికన ఇచ్చేవారు. అయితే నవంబర్ 1 నుంచి ఉద్యోగులు సొంత ఖర్చులతో వసతి భరించాలని ఏపీ ప్రభుత్వం జీఓలో వెల్లడించింది.

షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్ బంద్
ఇకపోతే ఇప్పటివరకు షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించింది. 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చేవారికి సచివాలయం, హెచ్‌ఓడీ విభాగాల్లో పనిచేసే ఈ ఉద్యోగులకు ప్రభుత్వమే ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారినప్పటికీ ప్రభుత్వం దీనిని కొనసాగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయం ఉద్యోగులు విజయవాడలోని తాత్కాలిక రాజధానికి వచ్చారు. విధి నిర్వహణలో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. మహిళా ఉద్యోగులు అయితే చెప్పుకోలేని బాధలు పడటంతో ప్రభుత్వం వారికి ఉచిత వసతి కల్పించింది. అలాగే అమరావతి రాజధాని పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలుచేస్తున్నారు. ఏపీ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తమ పిల్లల విద్య, ఉద్యోగాల లాంటి కారణాలతో హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి పూర్తిగా తరలిరానందున ఐదు రోజుల పనిదినాల వెసులుబాటును కల్పించారు. దీనిని 2018 నుంచి ఏటా పొడిగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed