టీఆర్ఎస్‌కు షాక్.. కమలం పార్టీలోకి మరో ఉద్యోగ నేత ?

2119

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేత, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఇటీవలే బీజేపీలో చేరగా.. ఆయనతో ఉద్యమంలో పాల్గొన్న దేవీప్రసాద్‌ సైతం కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. టీఆర్ఎస్‌పై అలకబూని కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దేవీప్రసాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మారుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక దేవీప్రసాద్‌కు బేవరేజెస్ కార్పొరేషన్ పదవిని అప్పగించినా.. ప్రస్తుతం ఆ పదవీకాలం సైతం ముగిసిపోయింది. ఇదేక్రమంలో తనతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నవారికి రెన్యూవల్ చేయగా.. దేవీప్రసాద్‌కు మాత్రం మరోసారి అవకాశం లభించలేదు. దీంతో టీఆర్ఎస్‌లో ఉంటే ఎలాంటి పదవులు రావని, తమ పార్టీలో చేరాలని బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తుండటంతో దేవీప్రసాద్ పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. స్వామిగౌడ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా దేవీప్రసాద్ ఖచ్చితంగా బీజేపీలో చేరుతారని, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు మరో షాక్ తగలడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.