రహస్యం.. ఐపీఎల్‌లో అంతులేని చీకటి కోణాలు

98

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్ల ఎంతో మంది యువ క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇక్కడ మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్లకు ఎంపికయ్యారు. డబ్బులు, అవకాశాలు, పేరు అన్నీ దక్కించుకుంటున్నారు. అనతి కాలంలోనే రూ. కోట్లు వచ్చి బ్యాంకుల్లో చేరిపోతున్నాయి. టీమ్ ఇండియా బెంచ్ ఈ రోజు పటిష్టంగా కనపడుతున్నదంటే దానికి కారణం ఐపీఎల్ అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. కానీ మరోవైపు బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్, రేసిజం, మద్యం, డ్రగ్స్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో కనపడతాయి. ఐపీఎల్ తళుకుబెళుకుల మధ్య ఈ చీకటి కోణం పెద్దగా బయటకు రాదు. బీసీసీఐ వంటి అత్యంత బలమైన క్రికెట్ బోర్డుకు తోడు ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కల్గిన బడా వ్యాపారులు అనేక చీకటి వార్తలను బయటకు రానివ్వకుండా సమాధి చేసేశారు. కానీ కొంత మంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకున్నారు. వెనుక జరిగే తతంగాన్ని ప్రజలకు వెల్లడించారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి చట్ట విరుద్దమైన కార్యాకలాపాల్లో ఫ్రాంచైజీ యాజమాన్యాల పాత్ర కూడా బయటపడింది.

ఐపీఎల్‌లో జాతి వివక్ష..

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జాతివివక్షపై తీవ్రమైన చర్చజరిగింది. బ్లాక్ లివ్స్ మ్యాటర్ సందర్భంగా ఎంతో మంది క్రికెటర్లు కూడా తమకు జరిగిన వివక్షను బయటపెట్టారు. కానీ అంతకంటే ముందే ఐపీఎల్‌లో వివక్ష కొనసాగింది. 2011లో చీర్ లీడర్స్ విషయంలో ఇలాంటి వివక్ష కొనసాగిందని దక్షిణాప్రికాకు చెందిన గాబ్రియేలా పాస్కోలో చెప్పింది. ముంబై ఇండియన్స్ తరపున ఆమె చీర్‌లీడర్‌గా ఆ ఏడాది పని చేసింది. అయితే బీసీసీఐ, ముంబయి ఇండియన్స్ పెద్దలు నల్ల వారిని చీర్ లీడర్‌గా పెట్టొద్దని హుకుం జారీ చేశారని చెప్పింది. అమెరికా, రష్యా, యూరోప్ దేశాలకు చెందిన వారిని మాత్రమే చీర్ లీడర్లుగా నియమించాలని ఆదేశించడంతో ఆమె వారితో వాదనకు దిగింది. ఇది కచ్చితంగా జాతి వివక్ష.. దీనిపై నేను ఫిర్యాదు చేస్తానని కూడా గాబ్రియేలా చెప్పుకొచ్చింది. కానీ బీసీసీఐ ఆ వివాదాన్ని ఆనాడే తొక్కిపెట్టింది. అయితే ఆ గొడవ అనంతరం ఇండియా, శ్రీలంక దేశాలకు చెందిన చీర్ లీడర్స్‌ను కూడా నియమించడం విశేషం.

ఆఫ్టర్ పార్టీల్లో రచ్చ..

ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ అనంతరం ఆయా ఫ్రాంచైజీలు ఆఫ్టర్ పార్టీలు అరేంజ్ చేసేవి. అక్కడ విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, అమ్మాయిలు అందుబాటులో ఉండేవారని కానీ ఆ విషయంలు బయటకు పొక్కుండా బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. కొన్ని సార్లు మద్యం మత్తులో సొంత జట్టు సభ్యులే గొడవలు పడేవారని.. దీంతో యాజమాన్యాలు ఆ పార్టీలను రద్దు చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఐపీఎల్‌లో బ్యాటుతో రాణించే ఒక క్రికెటర్ ఈ పార్టీలలో ఎప్పుడూ మునిగి తేలేవాడని తెలుస్తున్నది. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగు చూడక ముందు రేవ్ పార్టీలు కూడా నిర్వహించారని.. అయితే పోలీస్ నిఘా పెరగడంతో వాటిని ఆపేసినట్లు సమాచారం.

డబ్బులతో లోకల్ టాలెంట్ తొక్కేశారు..

ఐపీఎల్‌లో స్థానిక క్రికెటర్లు చాలా మంది పలు ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. బీసీసీఐ ఒత్తిడితో ఫ్రాంచైజీలు వారికి జట్టులోకి తీసుకోలేక తప్పలేదు. అయితే అలా ఎంపికైన క్రికెటర్లు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వారిని తుది జట్టులోకి తీసుకోవడానికి ఏ యాజమాన్యం సుముఖంగా లేదు. రికీ భయ్, బాబా అపరాజిత్ వంటి టాలెంట్ కలిగిన క్రికెటర్లు మూడు నాలుగు సీజన్ల పాటు బెంచ్‌కే పరిమితం అయ్యారు. వారికి ప్రతీ ఏడాది డబ్బు అయితే చెల్లించే వారు. కానీ ఒక్కరికీ ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. టి. నటరాజన్ కూడా రెండేళ్ల పాటు పంజాబ్ జట్టు బెంచ్‌పై ఉన్నాడు. అతడికి ఒక సారి అవకాశం ఇచ్చాకే అతడి ప్రతిభ అందరికీ తెలిసింది. కానీ స్టార్ క్రికెటర్ల మోజులో తమ కెరీర్లు నాశనం అయ్యాయని ఎంతో మంది యువ క్రికెటర్లు ఇప్పటికీ బాధపడుతున్నారు.

ఎప్పటికీ వీడని బెట్టింగ్..

ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియాకు పండగే. ఐసీసీ ఈవెంట్లకు కూడా పెట్టనంత బెట్టింగ్ ఐపీఎల్ సందర్భంగా జరుగుతున్నది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ చెప్పారు. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే స్వయంగా ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యం ఈ బెట్టింగ్ ముఠాకు సహకరిస్తుండటం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించారు. దీనికి కారణం స్వయంగా యాజమాన్యంలోని కీలక వ్యక్తులు బెట్టింగ్‌లో పాల్గొన్నారు. ఆ విషయం ఢిల్లీ పోలీసులు వెలుగులోకి తెచ్చే వరకు కనీసం బీసీసీఐకి కూడా తెలియదు. మ్యాచ్‌కు సంబంధించిన కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొని బెట్ చేసే వారని విచారణలో తేలింది. క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అంటారు. కానీ ఐపీఎల్ వంటి లీగ్స్‌లో జరిగే చట్ట విరుద్ద కార్యక్రమాలు దానికున్న పేరు ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..