దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

by  |
Srinivas goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ గా మారిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శుక్రవారం స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కుచుకుల్లా దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 సంవత్సరాల పరిపాలన కాలంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లలో జరిగిందని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తూ సాగునీరు, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేయడంవల్ల రైతులు రికార్డు స్థాయిలో పంటల దిగుబడిని సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రామప్ప దేవాలయం, భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు వచ్చామని, త్వరలోనే చార్మినార్, గోల్కొండకు కూడా ప్రపంచ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ప్రతి ఏటా 14 లక్షల మందికి పైగా వలసలు వెళుతూ ప్రజలు దుర్భర జీవితాలు గడిపేవారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ జిల్లా సస్యశ్యామలం అయిందని చెప్పారు. ఇతర జిల్లాల నుండి ప్రజలు వచ్చి ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ప్రజలందరూ ఆనందంగా గడిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతోపాటు, మన్నెంకొండ వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో రూ.400 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు అభినందించారు.


Next Story

Most Viewed