సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

by Ratna Kumari |

సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవిని కోరారు.

సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవిని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఇంజనీరింగ్, పరిశుభ్రత విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, తాగునీటి సరఫరా మెరుగుదల, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల అనంతరం రోడ్ల పునరుద్ధరణ, అలాగే శ్రీ లింగమంతుల స్వామి గుట్ట చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వివిధ గ్రాంట్ల ద్వారా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ పర్సన్ (టీఓ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), పరిశుభ్రత విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై ప్రభావం పడుతోందని పేర్కొంటూ, వెంటనే భర్తీ చేయాలని కోరారు. తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచేందుకు అదనపు పైప్‌లైన్ల ఏర్పాటుకు నిధులు అవసరమని, ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన శ్రీ లింగమంతుల స్వామి గుట్ట సమీపంలోని చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే పట్టణానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలో కొనసాగుతున్న యూజీడీ పనుల కారణంగా తవ్విన రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను టీకే.శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సూర్యాపేట సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తూ నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Next Story