అన్నపూర్ణ క్యాంటీన్లు నిల్.. ​ఆన్ లైన్ ఫుడ్ ఫుల్ ..!

by  |
Food Delivery
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో లాక్ డౌన్ పేదల కడుపు మాడ్చుతోంది. దినసరి కూలీలు, బీదలు, యాచకులు ఒక్కపూట తిండి దొరకక అల్లాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ల క్యాంటీన్లు నిర్వహిస్తోంది. పేదల అంతా వాటిపైనే పూట గడుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లు తెరిచి ఉన్నాయో లేదో కూడా వాళ్లకు తెలియడం లేదు. ఉదయం 10 గంటల వరకే లాక్ డౌన్ సడలింపు ఉండగా.. ఆ సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్లు తెరిచే పరిస్థితి లేదు. ఒకవేళ మధ్యాహ్నం బయటకు వెళ్లాలన్నా పోలీసులను చూసి ఇండ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో పస్తులు ఉండక తప్పడం లేదు.

బల్దియాలో 150 అన్నపూర్ణ క్యాంటీన్లు పనిచేస్తుండగా.. 35–40 వేల మంది ప్రతీ రోజూ భోజనాలు చేస్తున్నట్టు గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లాక్​డౌన్ విధించడంతో పని దొరకక కుటుంబాలతో సహా ఈ సెంటర్లలో తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రధాన సెంటర్లలో కొంత రద్దీగా ఉన్నా.. కొన్ని అన్నపూర్ణ కేంద్రాల వద్ద తినేవారు కూడా కనిపించలేదు. అయితే గతేడాది లాక్​డౌన్ సమయంలో ఒక్క రోజులో 1.56 లక్షల మంది భోజనాలు చేయగా.. ఒక నెల కాలంలో 41.48 లక్షల భోజనాలను జీహెచ్ఎంసీ అందించింది. అన్నపూర్ణ కేంద్రాలపై ఏ స్థాయిలో పేద ప్రజలు ఆధార పడి ఉన్నారో ఈ లెక్కలే చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కూలీలు, పేదలు, నిరాశ్రయులు సిటీలో తిరిగే పరిస్థితులు లేకపోవడంతో వారు అన్నపూర్ణ క్యాంటీన్లను కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు.

మరోవైపు లాక్​డౌన్, నైట్​ కర్ఫ్యూతో సంబంధం లేకుండా జొమోటో, స్విగ్గీ, ఊబెర్ ఈట్స్​ వంటి ఈ– కామర్స్​ బిజినెస్ కొనసాగుతోంది. ఎగువ మధ్యతరగతి, ధనవంతులు ఎక్కువగా ఈ సర్వీసులను ఉపయోగించుకుంటుంటారు. కాగా, లాక్​ డౌన్ సమయంలో సిటీలో ఉండే రెండు భిన్న వర్గాల ప్రజల జీవితాలు పూర్తి వైరుధ్యాల మధ్య సాగుతున్నాయి. గత లాక్​డౌన్ సమయంలో రోడ్లపై ఉండేవారి కోసం తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసి అక్కడ వారికి బస ఏర్పాట్లు చేశారు. అక్కడే వారికి భోజన సౌకర్యాలు కల్పించారు. గత అనుభవాలు జీహెచ్ఎంసీ, ప్రభుత్వానికి ఉన్నా.. ఈ సారి నిరాశ్రయులు, బిక్షాటన చేసేవారిని జీహెచ్ఎంసీ తరలించే ఏర్పాట్లు చేయలేదు. దీంతో వారంతా రోడ్లపైనే ఆకలితో అలమటిస్తున్నారు. మరో వైపు కరోనా భయాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.


Next Story