విమెన్ ఆఫ్ ది ఇయర్‌గా అంజూ బాబీ జార్జ్

by  |
విమెన్ ఆఫ్ ది ఇయర్‌గా అంజూ బాబీ జార్జ్
X

దిశ, స్పోర్ట్స్: భారత మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌కు అరుదైన పురస్కారం లభించింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఆమెను 2021 ఏడాదికి గాను ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో గౌరవించింది. 2016 నుంచి ఆమె అకాడమీ స్థాపించి బాలికల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నది. దేశంలో, క్రీడారంగంలో ఉన్న లింగ వివక్షకు వ్యతిరేకంగా అంజూ పోరాడుతున్నది. ఈ నేపథ్యంలోనే క్రీడలకు ఆమె చేస్తున్న సేవకు గాను వరల్డ్ అథ్లెటిక్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అంజూ బాబీ జార్జ్ 2003 వరల్డ్ అథ్లెటిక్స్ లాంగ్ జంప్‌లో రజత పతకాన్ని సాధించింది.

అథ్లెటిక్స్‌లో అనేక పతకాలు సాధించిన అంజు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అకాడమీ ప్రారంభించింది. ఆమె శిక్షణలో రాటుతేలిన అమ్మాయిలు అండర్ 20 విభాగంలో పతకాలు కూడా కొల్లగొడుతున్నారు. అంజూ బాబీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలవడం పట్ల ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అభినందించింది. ఆమె ఈ అవార్డుకు అర్హురాలేనని.. మహిళలు, యువతుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. కాగా, తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల అంజూ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆ దిశగా తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.


Next Story